శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (08:33 IST)

3న అల్పపీడనం...కోస్తాలో తేలికపాటి వర్షాలు

వచ్చే నెల 3వ తేదీన ఉత్తర అండమాన్‌ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం వున్నదని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే దక్షిణ శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

ఇది రాగల 24 గంటల్లో కొమరిన్‌ పరిసరాల్లో బలపడి 48 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం దానిని అనుకుని మాల్దీవులు, లక్షదీవుల ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం వుందని అంచనా వేస్తోంది.

దీని ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
 
సముద్రంలోకి 4250 టీఎంసీలు
కృష్ణా గోదావరి నదులనుంచి గత ఏడాది సముద్రంలోకి వదిలిన నీరు 2485 టీఎంసీలు కృష్ణా గోదావరి నదులనుంచి ఈ ఏడాది ఇప్పటివరకు సముద్రంలోకి వదిలిన నీరు 4250 టీఎంసీలు కృష్ణా, గోదావరి నదుల నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదనీరు సముద్రంలోకి వెళుతోంది.

ఈ రెండు నదుల్లో ఇంకా ప్రవాహాలు అధికంగానే ఉండడంతో సముద్రంలో కలిసే నీరు మరింత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.ఎగువ రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురియడంతో కృష్ణా బేసిన్‌లోని ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల వంటి అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి.

దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు శ్రీశైలం ప్రాజెక్టులోకి సుమారు 1582 టీఎంసీల నీరు వచ్చింది. అలాగే నాగార్జునసాగర్‌లోకి 1100 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఇలా ప్రాజెక్టులన్నీ నిండడంతో వరద నీటిని సముద్రంలోకి వదిలి పెడుతున్నారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు కృష్ణా నది నుంచి సుమారు 696 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలిపెట్టారు. అలాగే గోదావరి బేసిన్‌లోనూ వరద ప్రవాహం భారీగానే నమోదవుతోంది. సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టులు మినహా మిగిలిన ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి.

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు కూడా నిండింది. దాంతో వరద నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గోదావరి నది నుంచి సముద్రంలోకి ఇప్పటి వరకు సుమారు 3,554 టీఎంసీల నీటిని వదిలారు.