సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 మే 2023 (10:12 IST)

తిరుమల వెళ్లి వస్తుండగా తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ... ఏడుగురి మృతి

road accident
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఘోరం జరిగింది. తూఫాన్ వాహనాన్ని ఓ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తూఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న 14 మందిలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉమ్మడి కడప జిల్లాలోని ఏటూరూ సమీపంలో జరిగింది. 
 
అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్నాటకలోని బళ్లారికి చెందిన 14 మంది బంధువులంతా కలిసి తుఫాను వాహనంలో తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో కడప - తాడిపత్రి ప్రధాన రహదారిలో కడప జిల్లా కొండాపూర్ మండలం ఏటూరు గ్రామ సమీపంలోకి రాగానే వీరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఒకటి అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని రక్షించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.