చేవెళ్ల నుంచి రేవంత్ పాదయాత్ర.. రాములమ్మ కూడా..?
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన రేవంత్ రెడ్డి.. త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీలో వ్యతిరేకులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి.. సీనియ
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన రేవంత్ రెడ్డి.. త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీలో వ్యతిరేకులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి.. సీనియర్లతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డిలను కలుసుకున్న ఆయన ఇక వరుసబెట్టి కాంగ్రెస్ పెద్దలను కలుసుకుంటూ వారి సలహాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. సీనియర్లు ఇచ్చే సూచనలు.. సలహాలను పాటిస్తున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు పాదయాత్ర చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ తన పాదయాత్రకు చేవెళ్ల నుంచి శ్రీకారం చుట్టి కాంగ్రెస్‌ను ఎలాగైతే అధికారంలోకి తెచ్చారో, రేవంత్ కూడా అదే విధంగా చేవెళ్ల నుంచి యాత్రను ప్రారంభించి హస్తం పార్టీని అధికారంలోకి తెస్తారని ఆ పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర నిర్వహించాలని రేవంత్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
రేవంత్ రెడ్డికి చేవెళ్లలో కూడా మంచి ఫాలోయింగ్ వుండటంతో.. త్వరలోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. తాను చేపట్టబోయే యాత్రకు మద్దతు తెలపాల్సిందిగా సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్‌తో పాటు విజయశాంతి కూడా కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరున వరంగల్‌లో రాహుల్ సభ ఉన్నందున అది అయ్యాకే రేవంత్ రెడ్డి పాదయాత్రపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.