శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (13:24 IST)

అబ్దుల్ కలాం కంటే వైఎస్ఆర్ గొప్పవారా? ఏపీ విద్యాశాఖ తీరే వేరయా!!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రోజుకో వివాదంతో సాగుతోంది. ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న ముఖ్యమంత్రి జగన్ సర్కారు.. ఇపుడు తాజాగా మరో వివవాదంలో చిక్కుకుంది. గత టీడీపీ ప్రభుత్వం భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట 'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్' అవార్డులను ప్రవేశపెట్టింది. 
 
విద్యలో అత్యుత్తమ ప్రతిభాపాఠవాలు కనపరిచేవారికి ఈ అవార్డులు ఇస్తూ వచ్చింది. అయితే, రాష్ట్రంలో జగన్ సర్కారు ఏర్పడింది. దీంతో అబ్దుల్ కలాం పేరిట ఇస్తూ వచ్చిన పురస్కారాలను 'వైయస్సార్ విద్యా పురస్కారాలు'గా మార్చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. అంతే ఆయన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండానే పేరు మార్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరునే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదేసమయంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, జగ్జీవన్ రాం, పూలే పేర్లతో కూడా అవార్డులు ఇవ్వాలని ఆదేశించారు.