శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 నవంబరు 2019 (06:54 IST)

సీఎం జగన్ సర్కారు జీవో .. సుమోటాగా స్వీకరించిన ప్రెస్ కౌన్సిల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాను కట్టడి చేసే విధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు జీవో నెంబర్ 2430 అమలుకు నిర్ణయం తీసుకుంది. దీనిపై మీడియా సంస్థలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది దుర్మార్గపు జీవో అని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవో 2430 వివాదాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించింది. 
 
జీవోపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ ముఖ్య కమిషనర్ లకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా జీవో 2430పై ప్రెస్ కౌన్సిల్ వ్యాఖ్యానించింది. ఈ జీవో పాత్రికేయుల విధి నిర్వహణకు, మీడియా స్వేచ్ఛకు పెనుభారంగా ఉందని అభిప్రాయపడింది. 
 
మరోవైపు, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్, శ్రీరామచంద్రమూర్తిలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 938 జీవో తీసుకువస్తే అది పత్రికా స్వేచ్ఛకు ఉరిత్రాడు అని ఉద్యమం చేపట్టిన అమర్, శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు నోరెత్తకపోవడానికి కారణం ఏంటి? అని ప్రశ్నించారు.
 
ముఖ్యమంత్రి విసిరిన పదవుల కారణంగానే ఇద్దరూ మౌనంగా ఉండిపోయారా? అని నిలదీశారు. ఎంతటివాళ్లనైనా అధికారం లొంగదీస్తుంది కదా! అంటూ విస్మయం వ్యక్తం చేశారు. కాగా, దేవులపల్లి అమర్‌ను ఏపీ సర్కారు ప్రభుత్వ జాతీయ, అంతర్రాష్ట్ర మీడియా సలహాదారుగా, శ్రీరామచంద్రమూర్తిని ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.