శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 18 అక్టోబరు 2019 (18:07 IST)

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమైన ఆచార్య యార్లగడ్డ

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్‌తో ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం అధ్యక్షులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం రాజ్ భవన్‌లో గౌరవ గవర్నర్‌తో సమావేశమైన యార్లగడ్డ తాను రచించిన, అనువదించిన సాహితీ సంపుటాలను గవర్నర్‌కు బహుకరించారు. 
 
తెలుగు సాహిత్య ప్రక్రియలను హిందీ భాషలోకి అనువదించటం ద్వారా, ఉత్తర భారతదేశానికి దక్షిణాదికి మధ్య సాహిత్య వారధిగా పనిచేస్తున్న క్రమాన్ని యార్లగడ్డ గవర్నర్‌కు వివరించారు. నాటి నన్నయ మొదలు నేటి నారాయణ రెడ్డి (సినారే) వరకు పలువురు ప్రముఖ కవులు రచించిన కావ్యాలతో రూపొందించిన తాళపత్ర గ్రంధ పేటికను యార్లగడ్డ గవర్నర్‌కు అందించారు. గవర్నర్ దానిని ఆసక్తిగా పరిశీలించి అలనాటి నుండి నేటితరం వరకు సాహిత్య సంపదను కాపాడుతూ వస్తున్న కవుల గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. 
 
ఈ నేపధ్యంలో ఒరిస్సా రాష్ట్రంలోని పలువురు సాహితీవేత్తలను వీరిరువురు గుర్తుచేసుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడితో తనకున్న సాన్నిహిత్యాన్ని విపులీకరించిన లక్ష్మి ప్రసాద్, జై ఆంధ్రా ఉద్యమంలో వెంకయ్యనాయుడితో కలిసి జైలు జీవితం గడిపానని వివరించారు. ఈ నేపధ్యంలో బిశ్వ భూషన్ సైతం గత స్మృతులను మననం చేసుకుంటూ, జైలు జీవితం ఎన్నో పాఠాలను నేర్పుతుందని ప్రస్తుతించారు. 
 
ఆయా ప్రాంతాల భాషా సంస్కృతులను పరిరక్షించుకోవాలని, అదే క్రమంలో జాతీయతను మరవకూడదని గవర్నర్ పేర్కొన్నారు. సమావేశంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జున రావు తదితరులు పాల్గొన్నారు.