సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (16:06 IST)

వైఎస్ విజ్ఞతను అభినదించాలి... జగన్ అహంభావి : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. వైఎస్ విజ్ఞతతో కూడిన నేత అయితే, జగన్ అహంభావి అంటూ విమర్శలు గుప్పించారు. శుక్రవారం నాడు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో బాబు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఐదు నెలల్లో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారన్నారు. ఇసుక కొరతతో 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. వర్షాకాలంలోనూ విద్యుత్ కోతలు విధిస్తున్నారన్నారు. 
 
'2007లో వైఎస్‌ పత్రికా స్వేచ్ఛను హరించేలా జీవో తెచ్చారు. నాడు విలేకర్లు, ఎడిటర్లు, రాజకీయపార్టీలు ఆందోళన చేశాయి. వైఎస్‌ భయపడి నాడు జీవో రద్దు చేశారు. వైఎస్‌ విజ్ఞతను మనం అభినందించాలి. వైఎస్‌ రద్దు చేసిన జీవోను జగన్‌ మళ్లీ తీసుకొచ్చారు. జీవో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగన్‌ను హెచ్చరిస్తున్నాను. జగన్‌ గుర్తుంచుకోవాలి.. నాడు వైఎస్‌ చేసిన తప్పును సరిదిద్దుకున్నారు. జగన్‌కు అహంభావం. వివేకా కేసుపై మాట్లాడితే వర్ల రామయ్యకు నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఇంత మంది ఎస్పీలను, సిట్‌ను మార్చారు?. పోలీసులు మీసాలు తిప్పి తొడ గొడుతారా?' అని చంద్రబాబు మండిపడ్డారు.
 
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి గత ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని, విపక్ష నేతలను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఖజానాలో చిల్లిగవ్వలేకున్నా ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పాలన అవినీతి మయమంటూ ఆరోపించిన అధికార పార్టీ ఐదు నెలల కాలంలో కనీసం ఒక్కటైనా నిరూపించలేకపోయిందన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీరుపై ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.