శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 18 అక్టోబరు 2019 (12:35 IST)

ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధంతో లాభమా, నష్టమా? అసలు వైఎస్ జగన్ హామీ అమలు సాధ్యమేనా?

అది 2017 డిసెంబర్. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రుకు చెందిన 55 ఏళ్ల వరలక్ష్మి, దాదాపు మరో 25 మంది మహిళలు తమ ఊళ్లో మద్య దుకాణం కానీ బెల్ట్ దుకాణాలు కానీ నిర్వహించటానికి వీల్లేదంటూ ఆందోళనకి దిగారు. ఆ తర్వాత ఊళ్లోని చేపల చెరువులో దూకేశారు. ఇవాళ ఆ గ్రామం చుట్టు పక్కల మద్యం దుకాణం లేదు.

 
"పదహారు రోజులపాటు మేం నిరసన తెలియచేశాం. దాదాపు 400 మంది మహిళలు పాల్గొన్నారు. ఇంక ఓపిక నశించి.. ప్రాణాలైనా ఇస్తాం కానీ మద్యం దుకాణం పెట్టనివ్వబోమని చెరువులో దూకేశాం" అని చెప్పారు వరలక్ష్మి. తమ గ్రామంలో బెల్ట్ షాప్ ఉండటంతో కాలేజీ పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకూ చాలా మంది మద్యానికి బానిస కావటం చూశామని, అందుకే మద్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి మహిళలు బయటికి వచ్చారని తెలిపారు వరలక్ష్మి.

 
నిడమర్రు ఒకటే కాదు, జిల్లాకు చెందిన చివటంలో అచ్చాయమ్మ, ఆ గ్రామ ప్రజలు 2018లో చేపట్టిన ఉద్యమం కారణంగా దాదాపు 10 బెల్ట్ దుకాణాలు మూతపడ్డాయి. వరలక్ష్మి, అచ్చాయమ్మల లాగా ఎంతో మంది మహిళలు కొన్ని సంవత్సరాలుగా మద్యంపై పోరాటం చేస్తున్నారు.

 
"ఆనాడు ఎన్టీయార్ మద్య నిషేధం ఫైల్ మీద సంతకం పెట్టక ముందు జరిగిన ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. మార్పును నా కళ్లారా చూశాను. మద్య నిషేధం తర్వాత గ్రామాలు సంతోషంగా ఉన్నాయి. డబ్బును పిల్లల చదువులపైనో ఆస్తుల కొనుగోలుకో ఖర్చు చేసేవారు. మళ్లీ మద్యం బెల్ట్ దుకాణాలు మొదలయ్యాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది" అని వరలక్ష్మి తమ అనుభవాన్ని చెప్పుకొచ్చారు.

 
గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న మద్యంపై పోరాటం ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ఎజెండాగా మారింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 1, 2019 నుంచి మద్య నిషేధం దిశగా కార్యాచరణ వెల్లడించారు.
 
దశలవారీగా ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం
అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీలో భాగంగా బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా నడపాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా ఉన్న 4,380గా ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను 20 శాతం (3,500 దుకాణాలకు) తగ్గించారు. అంతేకాక, వైన్ షాపుల వేళలు కూడా మార్పు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గటంలా వరకు బదులు ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకూ దుకాణాలు తెరిచి ఉంచుతారు. దీంతో పాటు పర్మిట్ రూంలను తొలగించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు కూడా ఇప్పటికే పూర్తిగా తొలగించారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

 
"మద్యం దుకాణాల చుట్టుపక్కల గతంలో పర్మిట్ రూములు ఉండేవి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే గ్రామాల్లో బెల్ట్ షాపులు తొలగించాం" అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అంతేకాక, ఎక్సైజ్ డ్యూటీ కూడా పెంచారు. ఈ మద్య నిషేధం దశల వారీగా జరగనుంది. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడం వల్ల బెల్ట్ దుకాణాలకు ప్రోత్సాహం ఉండదు అంటున్నారు జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి. మద్యం పాలసీ రూపకల్పనకు లక్ష్మణ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేసి సమర్పించారు.

 
"ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో ప్రభుత్వం నియమించే ఉద్యోగులు ఉంటారు కనుక ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకి అమ్మే అవసరం ఉండదు. లాభాలు ఆశించే అవసరం ఉండదు. కనుక అక్రమ అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణ వంటివి ఉండవు" అని వివరించారు లక్ష్మణ రెడ్డి. దీంతో 16,000 కొత్త ఉద్యోగాలు కూడా వచ్చాయన్నారు.

 
ప్రభుత్వ నిర్వహణలో మద్యం దుకాణాలు, అమ్మకాలు
ఈ పద్ధతి ఇప్పటికే దిల్లీ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తుంది.
ఈ సంవత్సరం సెప్టెంబర్ 3-10 మధ్య కేరళలో మద్యం అమ్మకాలు రూ.487 కోట్లు కాగా ఇదే తేదీల్లో గత సంవత్సరం (2018)లో మద్యం అమ్మకాలు రూ.457 కోట్లుగా కేరళ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ వెల్లడించింది. మద్య నిషేధం దిశగా 2014లో యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని 713 బార్లు మూత పడ్డాయి. మద్యం అమ్మకాలను కేవలం ప్రభుత్వ దుకాణాలకు పరిమితం చేశారు. ఆదివారాలు డ్రైడే అని వెల్లడించారు. అయితే ఈ ఉత్తర్వులను 2017లో లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ప్రభుత్వం రద్దు చేయడమే కాక, గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని నిబంధనలను కూడా సడలించింది. మద్య నిషేధంతో టూరిజం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభావం పడింది.

 
"మద్య నిషేధం ప్రపంచంలో ఎక్కడ కూడా సఫలీకృతం కాలేదు. నిషేధించటంతో అక్రమ సారా, ఇతర మత్తు పదార్థాలకు బానిసలయ్యే అవకాశాలు ఎక్కువ. అక్రమ వ్యాపారులకు అవకాశమిచ్చినట్లవుతుంది. అందువల్ల పూర్తి నిషేధం కాకుండా ప్రభుత్వ నియంత్రణతో అమలు చేయడం అవసరం" అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు.

 
తమిళనాడులో మద్యం దుకాణాలను తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) నిర్వహిస్తుంది. 2003లో జయలలిత ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టాస్మాక్ కింద 5,152 రిటైల్ దుకాణాలు నడుస్తున్నాయి. 2014-15లో మద్యంపై ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.24,164 కోట్లు కాగా 2018-19 నాటికి ఆదాయం రూ.31,157 కోట్లు అని టాస్మాక్ వెల్లడించింది.

 
పూర్తి నిషేధం ఉన్న రాష్ట్రాలు
గుజరాత్, మిజోరం, నాగాలాండ్, బిహార్ రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో మద్య నిషేధం అమల్లో ఉంది. బిహార్ 2016లో మద్యం నిషేధించింది. అయితే జులై 8 వరకు ఉన్న సమాచారం ప్రకారం పట్నా హైకోర్టులో బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్, 2016 కింద నమోదైన కెసులు 2.08 లక్షలు. ఇందులో ఇప్పటిదాకా కేవలం 2,629 కేసుల్లో మాత్రమే విచారణ జరిగింది. 1.67 లక్ష మందిని మద్య నిషేధం ఉల్లంఘన కింద అరెస్ట్ చేశారని బిహార్ ప్రభుత్వం కోర్టుకు 2019 సెప్టెంబరులో ఇచ్చిన అఫిడవిట్‌లో తెలిపింది.
మద్య నిషేధం ప్రయోగాలు
పూర్తి నిషేధం దిశగా హరియాణా కూడా 1996లో ప్రయోగం చేసింది. కానీ 1998లో నిషేధాన్ని ఎత్తివేశారు. నిషేధం అమలు చేసిన సమయంలో ప్రభుత్వానికి దాదాపు రూ.1200 కోట్ల నష్టం జరిగి ఉండొచ్చని అక్కడి అధికారుల అంచనా. ఆంధ్ర ప్రదేశ్ కూడా నిషేధం దిశగా ప్రయోగాలు చేసింది. 1993 అక్టోబరులో ఆక్షన్లు జరగకుండా నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర మహిళలు ఆందోళనకి దిగారు. అక్కడ నుంచి ఉద్యమం మొదలైందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి వివరించారు.

 
"ఆనాడు మహిళల నినాదం ఒకటే. మద్యం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. నెల్లూరులో జరిగిన ఆందోళనతో ఆక్షన్లు వాయిదా వేయాల్సి వచ్చింది. అక్కడ నుంచి గుంటూరు, కృష్ణా ఇంకా అనేక జిల్లాల్లో ఆనాడు ఉద్యమం మొదలైంది. మద్య నిషేధాన్ని ఎన్టీఆర్ తన ఎన్నికల హామీల్లో చేర్చారు. గెలిచి, 1994లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పెట్టిన మొదటి సంతకం మద్యం నిషేధం ఫైల్ మీదే" అని ఆమె తెలిపారు.

 
అయితే ఈ మధ్య నిషేధాన్ని 1997లో చంద్రబాబు నాయుడు ఎత్తేశారు. 16 నెలలు మాత్రమే ఉన్న ఈ మధ్య నిషేధం రాష్ట్రానికి 1200 కోట్ల నష్టం మిగిల్చిందని అధికారులు తెలిపారు. అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయం కోసం ప్రజల మేలు పట్టించుకోకుండా నిషేధం ఎత్తివేసిందంటున్నారు రమాదేవి.

 
"మద్య నిషేధం అమల్లోకి వచ్చాక ఆ మార్పుకు అలవాటు పడేందుకు కొన్ని నెలలు పట్టింది. ఈలోపు గుడుంబా, కల్తీ సారా అమ్మకాలు, అవి తాగి జనాలు మరణించటంతో నిషేధం తీసేశారు. కానీ వాస్తవానికి నిషేధం ఉన్న కొద్ది కాలంలో నేరాల సంఖ్య.. ముఖ్యంగా మహిళలపై గృహ హింస తగ్గింది. మేం చాలా ఉదాహరణలు చూశాం" అంటున్నారు రమా దేవి.

 
మద్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ముడిపడి ఉందా?
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్సైజ్ ద్వారా 2018-19లో వచ్చిన ఆదాయం 6,222 కోట్ల రూపాయలు. రాష్ట్రం మొత్తం ఆధాయం 1,05,062 కోట్ల రూపాయలు. విభజన తరువాత రాష్ట్రానికి ఉన్న అప్పులు 16,000 కోట్ల రూపాయలు. అయితే వెంటనే రాష్ట్ర పైన ప్రభావం ఉండదు అంటున్నారు ఎక్సైజ్ అధికారులు. 2019-20లో ఎక్సైజ్ ఆదాయం 8,51,8 కోట్లు ఉండచ్చు అని అంచనా.
జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలు 15-20 శాతం పెట్రోల్ మీద వచ్చే సేల్స్ టాక్స్ పైన, 10-15 శాతం మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం పైన ఆధారపడి ఉన్నాయని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిపై రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

 
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మద్య నిషేధం నిర్ణయంపై లిక్కర్ ఇండస్ట్రీ దిగ్గజాలు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. జులై 2019లో జరిగిన యునైటెడ్ స్పిరిట్స్ రిజల్ట్స్ కాల్‌లో ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తావన వచ్చింది. యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ వివిధ పేర్లతో మద్యం తయారు చేస్తుంది. ఈ సంస్థకి ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే ఆదాయం 3-4 శాతం.

 
"ఇప్పుడే పూర్తి స్థాయి మద్య నిషేధం లేదు కనుక అది మంచి విషయమే. ప్రస్తుతం ప్రభుత్వం రిటైల్ దుకాణాలను తన పరిధిలోకి తీసుకుంది. ఇలా ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మద్యం దుకాణాల నుంచి అమ్మకాల విషయంలో యునైటెడ్ స్పిరిట్స్‌కు మిశ్రమ అనుభవం ఎదురైంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. అక్కడ నేర్చుకున్న పాఠాలను ఆంధ్ర ప్రదేశ్‌లో ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికి చూస్తే ఎక్సైజ్ డ్యూటీ కూడా పెంచారు. బెల్ట్ షాపులు మూసేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మద్యం దుకాణాలపై సరైన స్ట్రాటజీతో ముందుకు వెళ్తే ఆంధ్ర ప్రదేశ్‌లో అవకాశాలు ఉన్నాయి" అని యునైటెడ్ స్పిరిట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ క్రిపాలు తెలిపారు.

 
మరో కంపెనీ రాడికో ఖైతాన్ లిమిటెడ్.. 2018-19 వార్షిక నివేదికలో రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని నిషేధించడం వల్ల ఐఎంఎఫ్ఎల్‌ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్)పై ప్రతికూల ప్రభావం పడుతుందని వెల్లడించింది. "చారిత్రకంగా చూస్తే భారత్‌లో మద్య నిషేధం నిలవలేదు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక, మద్యంపై వచ్చే ఆదాయం వాటా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో కీలకం" అని ఈ రిపోర్ట్ తెలిపింది.

 
మద్య నిషేధం - పక్క రాష్ట్రాలకు లాభం
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం అప్లికేషన్ల గడువు అక్టోబర్ 16తో ముగిసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్లు 10 రెట్లు ఎక్కువ తీసుకున్నారని రాష్ట్ర ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సి.వివేకానంద రెడ్డి తెలిపారు. "కొత్త ట్రేడర్స్ దరఖాస్తులు కొనుగోలు చేస్తున్నారు. మొదటి మూడు రోజుల్లోనే రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది" అని ఆయనన్నారు. సరిహద్దు జిల్లాలు- నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం - నుంచి దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో 2,216 దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి ఫీజు రెండు లక్షల రూపాయలు.

 
రాజకీయ ఎజెండా Vs సామజిక మార్పు
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ చేయించిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలో దాదాపు 16 కోట్ల మందికి మద్యం అలవాటు ఉన్నట్లు తేలింది. అందులో మూడు కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారారు. అందులో 6 శాతం ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నారు. మద్యానికి బానిసైన వారికి కౌన్సిలింగ్ అందించేందుకు ప్రభుత్వ డీఅడిక్షన్ కేంద్రం ఇప్పటి వరకు కేవలం ఒక్కటే ఉంది. వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది అంటున్నారు లక్ష్మణ రెడ్డి.

 
ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మద్య నిషేధం నినాదంతో ఉద్యమాలు జరుగుతున్నాయి. 2015లో మహారాష్ట్ర ప్రభుత్వం మానవ హక్కుల సంఘానికి రైతు ఆత్మహత్యలపై రాసిన ఒక లేఖలో... రైతులు మద్యానికి బానిసలు కావటం కూడా ఆత్మహత్యకు ఒక కారణంగా పేర్కొంది. మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో అనేక చోట్ల మహిళలు మద్య నిషేధం రాజకీయ అజెండాగా పెట్టుకోకపోతే ఓట్లు వేయబోమని తీర్మానం కూడా చేస్తున్నారు.

 
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేయటంపైనే దాని విజయం ఆధారపడి ఉందంటున్నారు వరలక్ష్మి, అచ్చాయమ్మ. "ఈరోజు హంగామా చేసి, వచ్చే కొద్ది రోజుల్లో నిషేధం అన్నాక.. దాని అమలు కూడా అంతే కఠినంగా చేయాలి" అంటున్నారు వరలక్ష్మి.
బెల్ట్ షాపులు నిర్వహిస్తునందుకు దాదాపు 2,872 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు మంత్రి నారాయణస్వామి. అలాగే అక్రమ మద్యం తయారు చేస్తున్నందుకు 4,788 కేసులు నమోదు చేశామని చెప్పారు.

 
"ప్రభుత్వ మద్యం దుకాణం టైం ప్రకారం సరిగ్గా నడిపితే చాలు. బెల్ట్ షాపులు రాకపోతే చాలా మేలు. గ్రామంలో అందుబాటులో లేకపోవటంతో మద్యం వినియోగం కొద్దిగా తగ్గుతుంది. అది సరిగ్గా అమలు చేస్తే అంతే చాలు" అంటున్నారు అచ్చాయమ్మ.