డంబెల్‌ను శివుడి ఢమరుకంలా భావించి తలపై కొట్టి చంపేశారా?
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇటీవల పద్మజ, పురుషోత్తం నాయుడు అనే దంపతులు తమ ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే, ఈ హత్యలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతరాలేదు. కానీ, హైకోర్టు న్యాయవాది రజని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డంబెల్‌నే శివుడి ఢమరుకంలా భావించి ఇద్దరు కుమార్తెల తలపై బలంగా కొట్టి చంపేసివుంటారని సందేహిస్తున్నారు.
అంతేకాకుండా, హైదరాబాదుకు చెందిన కృష్ణమాచార్య అనే న్యాయవాది తరపున ఆమె మదనపల్లె సబ్ జైలులో ఉన్న పద్మజ, పురుషోత్తంనాయుడలను కలిసే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు పురుషోత్తంనాయుడుతో మాట్లాడేందుకు కొన్ని నిమిషాల అనుమతి మంజూరు చేశారు. అది కూడా చాలా దూరం నుంచి పురుషోత్తంనాయుడుతో మాట్లాడించారు.
ఆ తర్వాత జైలు బయటకు వచ్చి న్యాయవాది రజనీ మాట్లాడుతూ, నిందితులకు న్యాయసహాయం అవసరమని తాము భావిస్తున్నామని, ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఘటన స్థలంలో జరిగింది క్షుద్రపూజలని చెబుతున్నారని, కానీ అక్కడ శివుడి పూజలు జరిగి ఉండొచ్చన్నారు.
పద్మజ, పురుషోత్తంనాయుడు దంపతులు తమకు కనిపించిన డంబెల్‌నే శివుడి ఢమరుకంగా భావించి కుమార్తెల తలపై బలంగా మోది చంపేసి ఉంటారని వివరించారు. నేనే శివుడ్ని అనుకుంటూ డంబెల్‌తో కొట్టి, మళ్లీ బతికి వస్తారని భావించారని తెలిపారు.
అసలు, తమ ఇద్దరు బిడ్డలు చనిపోయారన్న స్పృహ వారిలో లేదని, పూజ మధ్యలో పోలీసులు బూట్లతో వెళ్లి భంగం కలిగించడం వల్ల తమ కుమార్తెలు తిరిగి రాలేదన్న భ్రమలో ఉండిపోయారని భావించాల్సి ఉందన్నారు.
పైగా, ఈ కేసులో ఇంకెన్నో విషయాలు తెలియాల్సి ఉందని రజని అభిప్రాయపడ్డారు. పద్మజ, పురుషోత్తంనాయుడులను ఈ హత్యలకు ప్రేరేపించినవారికి శిక్షలు వేయాలని అన్నారు. పురుషోత్తంనాయుడుతో మాట్లాడడం ద్వారా కొన్ని విషయాలు తెలిశాయని వెల్లడించారు.
ముఖ్యంగా, భోపాల్‌లో ఉన్న సమయంలో అలేఖ్య ఆధ్యాత్మిక శక్తిని ఆవాహన చేయడం నేర్చుకుందని చెప్పారని వివరించారు. అమ్మాయిలకు రక్షణ లేదని భావించడం వల్లే అలేఖ్య ఆధ్యాత్మిక శక్తి కోసం ప్రయత్నించినట్టు అర్థమవుతోందని అన్నారు. అయితే, జైలులో దూరంగా ఉంచి మాట్లాడించడం వల్ల మరిన్ని విషయాలు తెలుసుకోలేకపోయానని రజని వివరించారు.