గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (07:38 IST)

మూడు రాజధానులకు వ్యతిరేకం: సిపిఎం

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, అదే సమయలో హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని సిపిఎం పేర్కొంది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. 'అభివృద్ధి వికేంద్రీకరణకు మా పార్టీ వ్యతిరేకం కాదు. రాజధానిని వికేంద్రీకరించకుండా దానిని సాధించాలి' అని ఆయన పేర్కొన్నారు.

హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది రాజధానితో సంబంధం లేని ప్రత్యేక స్వతంత్ర అంశమని కోర్టు దృష్టికి తీసుకువచ్చిన ఆయన 'కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని మా పార్టీ భావిస్తోంది.' అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుంటోందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

రాజధాని వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నలుగురు రైతులు దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు అభిప్రాయాలు తెలపాలని అన్ని పార్టీలను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో దాఖలుచేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని, బాధ్యతల నుంచి పారిపోతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇస్తామని పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని, పునర్‌ వ్యవస్థీకరణ చటంలో పేర్కొన్న అనేక అంశాలను అమలు చేయడం లేదని వివరించారు.

రాజధాని విషయంలో తమకు సంబంధం లేదని కేంద్రం చెప్పడం సమంజసంగా లేదని, పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కేంద్రమే నిర్ణయించిందని పేర్కొన్నారు . పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, మండలి కార్యాలయాల నిర్మాణాలకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాల్సిఉందని తెలిపారు.

అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని, అనంతరం వివిధ నిర్మాణాలకు కేంద్రం రూ.1500 కోట్లు నిధులు విడుదల చేసిందని తెలిపారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి శాసనసభలో అమరావతిని స్వాగతించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

కేంద్రప్రభుత్వ మద్దతుతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. నిర్మాణాల పేరుతో అమరావతిలో వేలకోట్లు ఖర్చు చేశారని, పైగా రాజధాని పేరిట రాజధాని పేరిట రైతుల నుండి భూములు సేకరించారని, ఆ సమయంలో వారికి అనేక హామీలిచ్చారని పేర్కొన్నారు ఇప్పుడు ఇక్కడ నుండి తరలిస్తే వారి పరిస్థితి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయం, ఐటి, పరిశ్రమలు, విద్య, మౌలిక వసతుల కల్పనను అన్ని ప్రాంతాలకు విస్తరించడండం ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని సూచించారు. దానికి భిన్నంగా పాలనా వికేంద్రీకరణ పేరిటర రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రజల మధ్య విబేధాలు తెచ్చేలా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన సిర్‌డిఏ రిపీల్‌ యాక్టు, వికేంద్రీకరణ చట్టాలు కేంద్రం రూపొందించిన పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు.

ఇప్పటికే కేంద్రం నుండి నిధులు రావడం లేదని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఈ పరిస్థితుల్లో రాజధానిని తరలించడం అంటే ప్రజలపై పెనుభారం మోపడమేనని పేర్కొన్నారు. 2016 నుండి అమరావతిలోనే రాజధాని కొనసాగుతోందని, ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్నప్పుడు రాజధానిని తరలించాల్సిన అవసరం లేదని తమ పార్టీ అభిప్రాయపడుతోందని తెలిపారు.