సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (22:12 IST)

చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపిన అఖిలభారత రైతు సంఘం

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి మళ్లీడి యలమందరావు, రాష్ట్ర సాగునీటి వినియోగాల సంఘం అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు రైతు నాయకులు ప్రసాదు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలిసి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ తక్షణమే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు,

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైసీపీశ్రేణులు చేసిన దాడులపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్ఘటన, దుర్మార్గం ఎన్నడూ జరగలేదని, పథకం ప్రకారం అధికారపార్టీ కనుసన్నల్లో  ఈ దాడులు జరిగాయన్నారు.

డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే టీడీపీ కేంద్ర కార్యాలయం ఉందని, అక్కడ దాడి కచ్చితంగా పోలీసుల ప్రోద్భలంతోనే జరిగిందని దుయ్యబట్టారు  రెండేళ్లుగా రాష్ట్రంలో పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారని, దుండగులు దాడికి వస్తున్నారని పోలీసులకు చెప్పినా వారు స్పందించలేదన్నారు.

పోలీస్ శాఖ సకాలంలో స్పందించి ఉంటే, ఈ దాడి జరిగేదే కాదన్నారు.అమరావతి దళిత రైతుల పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే స్థితికి పోలీస్ శాఖ దిగజారిందన్నారు. అధికారం శాశ్వతం కాదనే వాస్తవాన్ని సీఎం జగన్ గుర్తించాలన్నారు. అధికారం ఉంది కదా అని పార్టీలపై, నేతలపై దాడి చేయిస్తానంటే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకోబోమని వైసీపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారని, వారి ఆలోచనలు, వైఖరి ఎంతమాత్రం సరైంది కాదన్నారు. ప్రతిపక్షాలుగా తాముప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి అనైతిక, రాజ్యాంగ విరుద్ధ చర్యలను ప్రశ్నిస్తూనే ఉంటామని, ఎవరినీ వదిలేది లేదని తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మేధావులు, రాజకీయపార్టీలు,ప్రజాసంఘాలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. హోంమంత్రి సుచరిత తక్షణమే తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు,