తెలంగాణ గవర్నరు తమిళిసై కు స్వరూపానందేంద్ర ఆశీస్సులు
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శుక్రవారం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను సందర్శించారు. హైదరాబాదులోని
చందా నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయ రజతోత్సవాలకు ఆమె హాజరై స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు.
తెలంగాణ గవర్నరుకు స్వరూపానందేంద్ర స్వామి జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిమను బహూకరించారు. గవర్నరు నుదుట తిలకం దిద్ది రాజశ్యామల అమ్మవారి రక్షా రేఖను కట్టారు. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు.
లోక కళ్యాణార్దం ఆధ్యాత్మిక మార్గంలో విశాఖ శారదా పీఠాధిపతులు చేపడుతున్న కృషి అభినందనీయమని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలందరినీ బయటపడేయాలని స్వామీజీని కోరుకున్నట్లు గవర్నర్ చెప్పారు. చందానగర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు శోభాయమానంగా ఉన్నాయని పేర్కొన్నారు.