సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మార్చి 2024 (10:37 IST)

వైకాపా అభ్యర్థుల జాబితా... పేరుకే నా ఎస్సీలు.. బీసీసీలు.. రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట..

ysrcpjagan
ఏపీలోని అధికార వైకాపా పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 49 మంది, 25 లోక్‌సభ స్థానల్లో 5 చోట్ల తన సొంత సామాజికవర్గమైన రెడ్డి వర్గీయులకే సీట్లు ఇచ్చింది. కానీ, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మాత్రం బహిరంగ సభల్లో మాత్రం నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ బీకరాలు పలుకుంటారు. ఆచరణలో మాత్రం ఆ మూడు వర్గాలకు మొడి చేయి చూపించి తన రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారు. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోను 49 మంది రెడ్లకు ఆయన సీట్లు ఇచ్చి, తన కులంపై ఉన్న భక్తిని చాటుకున్నారు. 
 
ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సగటున 80 శాతానికిపైగా సీట్లలో తనవారికే పోటీ చేసే అవకాశమిస్తూ 'నా'వాళ్లంటే నా సామాజిక వర్గమేనని తేల్చి చెప్పారు. తాను నిత్యం ప్రవచించే సామాజిక న్యాయానికి ఇడుపులపాయ ఎస్టేట్ సాక్షిగా సమాధి కట్టారు. ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వుడు స్థానాలు మినహా ఒక్కటీ అదనంగా ఇవ్వలేదు. 25 మంది సిట్టింగులకు సీట్లు నిరాకరించారు. 15 మందిని బదిలీచేశారు. ఆరుగురు సిట్టింగుల స్థానంలో వారసులకు అవకాశమిచ్చారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయించనున్నారు. తొలిసారి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం 46 మందికి దక్కింది.
 
సీమ జిల్లాల్లో వైసీపీ తరపున పోటీ చేసే అర్హత మరెవరికీ లేదనుకున్నారో, ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారో మరి, ఎక్కువ సీట్లను సొంత సామాజికవర్గానికే ఇచ్చారు. ఉమ్మడి కడప జిల్లాలో జనరల్ సీట్లు 8 ఉంటే అందులో 7 చోట్ల తన సామాజిక వర్గీయులనే బరిలో నిలిపారు. ఇది 87 శాతం పైనే. బడుగుల జిల్లా అనంతపురంలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 12 జనరల్ సీట్లున్నాయి. ఇందులో 8 సీట్లను సీఎం సొంత సామాజికవర్గం వారికి కేటాయించుకున్నారు.
 
మరో రెండు చోట్ల అభ్యర్థులు భర్తలు, జగన్ సామాజికవర్గం వారే. అయితే ఆ మహిళలిద్దరికీ బీసీల కోటాలో ఇచ్చినట్లు లెక్కలో చూపించారు. మొత్తంగా 12 జనరల్ స్థానాల్లో 10 సీట్లు అంటే 83 శాతం సొంత సామాజికవర్గానికే. ఉమ్మడి కర్నూలులో 12 జనరల్ సీట్లలో 9 చోట్ల సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికే సీట్లు కేటాయించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 జనరల్ సీట్లలో 8 చోట్ల తన సామాజిక వర్గీయులనే బరిలో నిలిపారు.