మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (15:48 IST)

రాజధాని మంటలు : మందడంలో మహిళలపై పోలీసులు దాడి

రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పిలుపు మేరకు శుక్రవారం నుంచి సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. దీంతో రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల ప్రజలు సమ్మెకు దిగారు. 
 
ఈ సమ్మెలోభాగంగా, శుక్రవారం మధ్యాహ్నం మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళా రైతులను పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించబోయారు. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు ఎదురుతిరిగి, వాగ్వివాదానికి దిగారు. 
 
రైతులను పోలీసులు వాహనంలో ఎక్కిస్తుండగా అడ్డుపడ్డారు. దీంతో పోలీసు వాహనం టైరు చేతిపైకి ఎక్కడంతో ఓ రైతుకి గాయాలయ్యాయి. పోలీసుల తీరు సరిగాలేదంటూ పోలీసు వాహనానికి ఎదురుగా రైతులు పడుకున్నారు. దీంతో వారిని పోలీసులు అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
మహిళల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనను వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ముక్తకఠంతో ఖండించారు. పోలీసుల తీరును ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. అధికార పార్టీ నేతల చేతిలో పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తంచేశారు.