సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (15:20 IST)

151 సీట్లు శాశ్వతం కాదు ... వైకాపా సర్కారు ఎపుడైనా కూలిపోవచ్చు

ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టివార్నింగ్ ఇచ్చారు. 151 సీట్లు ఉన్నాయన్న గర్వం పనికిరాదనీ, ఈ సర్కారు ఎపుడైనా కూలిపోవచ్చంటూ హెచ్చరించారు. రాజధానిని తరలించవద్దంటూ అమరావతి ప్రాంత రైతులు గత 14 రోజులుగా ఆందోళనలు, నిరసనలకు దిగారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు పవన్ మంగళవారం అమరావతి ప్రాంతాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే, ఆయన పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. 
 
అయినప్పటికీ కాలి నడకన వెళ్లి ఎర్రబాలెంలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, హైకోర్టును తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని... ఆ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉంటుందన్నారు. కర్నూలుకు హైకోర్టును తరలిస్తామంటూ రాయలసీమ ప్రజలను కూడా వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. 
 
లెజిస్లేటివ్ అసెంబ్లీని విజయనగరంలో పెట్టాలని జీఎన్ రావు కమిటీ చెప్పిందని... విశాఖలోని భీమిలిలో పెట్టాలని చెప్పలేదన్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 'భూములు అమ్ముకోవడానికో, దేనికో... రకరకాల ఆలోచనలు. వారి బుర్రలో ఏముందో నాకే అర్థం కావడం లేదు' అని అన్నారు. 
 
అమరావతి ప్రాంత మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి... రోడ్లపై ఆందోళనలు చేయడం బాధిస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులను వైసీపీ నేతలు పశువులుగా అభివర్ణిస్తుండటం దారుణమన్నారు. ఏ గొడవైనా మొదట చిన్నగానే ప్రారంభమవుతుందని... నెమ్మదిగా తీవ్ర రూపం దాల్చుతుందని హెచ్చరించారు. అమరావతి రైతులు పోరాటాన్ని ఆపకూడదని, ఇలాగే కొనసాగించాలని పిలుపునిచ్చారు. 151 సీట్లు శాశ్వతం కావని... అవి ఎప్పుడైనా పోవచ్చని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు.