సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (13:28 IST)

రాజధాని ప్రజలపై ప్రజాప్రతినిధుల అత్యాచారం : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత పర్యటనకు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టారు. అయితే ఆయన పర్యటనకు పోలీసులు తీవ్ర ఆటంకం కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కాలినడకన రైతులకు సంఘీభావం తెలిపేందుకు ముందుకు సాగిపోతున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం చాలా కష్టమన్నారు. మనం ఇప్పటికే హైదరాబాద్ నగరాన్ని పోగొట్టుకున్నామని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాదని, శాశ్వత రాజధాని అని చెప్పారు. 
 
సాధారణంగా ఒక నగరాన్ని నిర్మించాలంటే దశాబ్దాలు పడుతుందన్నారు. అలాగే, అమరావతి నిర్మాణం కూడా కొన్ని సంవత్సరాలు పడుతుందన్నారు. కానీ, లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని, అంత నిధులు తమ వద్ద లేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. 
 
అమరావతికి 3 వేల ఎకరాలు చాలని తొలుత తాను అనుకున్నానని... రైతులు 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు తనకు భయమేసిందన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతులు భూములు ఇవ్వలేదని... అద్భుతమైన రాజధాని కోసం భూములు ఇచ్చారని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం మారిపోతే అమరావతి భవితవ్యం ఏమిటని గతంలోనే తాను ఆందోళన వ్యక్తం చేశానని తెలిపారు.
 
అమరావతి బాండ్లను రిలీజ్ చేసి, సీఆర్డీఏ అనే చట్టాన్ని చేసిన తర్వాత కూడా రాజధాని భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉండటం దారుణమని పవన్ అన్నారు. ఇది ప్రజలపై ప్రజాప్రతినిధులు చేసిన అత్యాచారమని... ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఖచ్చితంగా అత్యాచారమేనని... ఎవరికీ చెప్పుకోలేని అత్యాచారమని అన్నారు. చెప్పుకుంటే ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయ అసమానతలు వస్తాయని చెప్పారు.
 
అమరావతి రైతులకు అండగా ఉంటానని మాట ఇస్తున్నానని పవన్ అన్నారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్ రాజధాని అని ఇప్పటికీ ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదన్నారు. జగన్‌ను 13 జిల్లాల ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని... ఆయన మాత్రం తాను కొన్ని జిల్లాలకే సీఎం అనే విధంగా వ్యవహరిస్తున్నారని పవన్ విమర్శించారు.