గురువారం, 6 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 నవంబరు 2025 (12:27 IST)

మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను ఆపిందా? చిన్మయి ఘాటు వ్యాఖ్యలు

Chinmayi
Chinmayi
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించకపోవడంపై ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే విమర్శలకు దారితీశాయి. ఈ విమర్శలపై చిన్మయి ఘాటుగా స్పందించింది. భర్తకు మద్దతుగా నిలుస్తూ, సంప్రదాయాలను ప్రశ్నించిన వారికి గట్టి సమాధానం ఇచ్చింది. 
 
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన, పెళ్లి తర్వాత మహిళలు తప్పనిసరిగా తాళి ధరించాలనే సంప్రదాయాన్ని తాను సమర్థించనని స్పష్టం చేశారు. తన భార్య చిన్మయిని ఎప్పుడూ మంగళసూత్రం వేసుకోమని బలవంతం చేయలేదని వెల్లడించారు. 
 
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొందరు రాహుల్‌ను సమర్థిస్తే, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ఈ కామెంట్లు రాహుల్‌పై వున్న గౌరవాన్ని పోయేలా చేసిందని నెటిజన్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, తన భర్తపై వస్తున్న విమర్శలపై చిన్మయి ఎక్స్ ద్వారా స్పందించింది. 
 
మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను, వేధింపులను ఆపలేదు. పుట్టుక నుంచి మరణించే వరకు ఈ సమాజంలో మహిళలకు ఏ దశలోనూ భద్రత లేదు. చాలాచోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. 
 
అప్పుడే పుట్టిన పసికందులపై దారుణాలు ఆగడం లేదు కదా.. అంటూ చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశంపై కొత్త చర్చకు తెరలేపాయి.