చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఎలా జరిగిందంటే?  
                                       
                  
				  				   
				   
                  				  ఒకపుడు రాష్ట్రంలో సంచలనంగా మారిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్షలు విధిస్తూ చిత్తూరు కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో ఈ దంపతుల హత్య ఎలా జరిగిందో పరిశీలిద్దాం.
				  											
																													
									  
	 
	తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కఠారి మోహనక్‌కు చింటూ మేనల్లుడు. వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మేయర్‌గా ఉన్న అనురాధ, మేనమామ మోహను అడ్డు తొలగించుకోవాలని చింటూ నిర్ణయించుకున్నాడు. 
				  
	 
	2015 నవంబరు 17న చింటూ, మరో నలుగురు బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించారు. కఠారి అనురాధపై చింటూ, మరికొందరు తుపాకులతో కాల్పులు జరపగా ఆమె అక్కడే నేలకొరిగారు. పక్క గదిలో ఉన్న కఠారి మోహనన్‌ను కత్తులతో నరికారు. కొన ఊపిరితో ఉన్న మోహన్ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	మేయర్ దంపతులను చంపే క్రమంలో అక్కడే ఉన్న వేలూరి సతీష్ కుమార్ నాయుడినీ చంపేందుకు మంజునాథ్ యత్నించడంతో అప్పట్లో హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఇందులోనూ నేరం రుజువైంది. హంతకులకు ఆయుధాలు సమకూర్చడం, ఆశ్రయం ఇవ్వడం, ధనసాయం చేశారని మిగిలిన 16 మందిపై పోలీసులు అభియోగం మోపగా విచారణలో రుజువు కాలేదు. దీంతో వారిని నిర్దోషులుగా పేర్కొన్నారు. 
				  																		
											
									  
	 
	పదేళ్లకు తీర్పు వచ్చిన ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడ్డాయి. 130 మంది సాక్షులను విచారించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్‌లు అరెస్టయినప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో దోషులకు వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు తరలించనున్నారు.