మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2019 (10:49 IST)

జగన్ తొలి హామీ ఇంకా అమలు కాలేదు.. రాజధానిపై నిరసన సెగలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రి అధికారం చేపట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఏడాది మే 30న విజయవాడలో జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణస్వీకారోత్సవం తర్వాత చేసిన తొలి సంతకమే ఇంతవరకు అమలు కాలేదు. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ లబ్ధిదారుల వయస్సును 65 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. 
 
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ ఫైల్ మీద సంతకం కూడా చేశారు. అయితే, ఇంత వరకు ఆ విషయంలో అడుగు మాత్రం ముందుకు పడలేదు. గతంలో లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత నుంచి నేటి వరకు మధ్యలో 60 సంవత్సరాలు దాటిన ఎవరికీ పెన్షన్లు రావడం లేదు.
 
మరోవైపు మూడు రాజధానుల ప్రకటన ఏపీలో సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. నేటితో రైతుల దీక్షలు, ఆందోళనలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. 
 
వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అమరావతి రైతులకు మహిళలు,యువత పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావం ప్రకటించారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగానికి ఫలితం ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు.