రాజధానిని తరలించవద్దు.. ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్ధమైతే?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలించవద్దని రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. మండడం-వెలగపూడిలో రైతుల నిరసనలకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతుల కాళ్లు కడిగిన బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ వారికి పాదాభివందనం చేశారు. రాజధాని కోసం 150 ఎకరాలు ఇచ్చిన సుబ్బారావు, నాగరత్నమ్మ దంపతులను సన్మానించారు.
దంపతుల కాళ్లు కడిగి ఆ నీళ్లను తమ తలలపై రైతులు చల్లుకున్నారు. తమ బాధను ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని రాజధాని రైతులు కోరారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు రాజధాని అమరావతిని తరలించవద్దని, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం కావాలని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్ధమైతే రాజధాని ఇక్కడే ఉంటుందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చరిత్రలో నిలిచిపోతారని, వారు కనుక రాజీనామాలు చేస్తే ఆయా స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి కూడా నిలబెట్టమని సూచించారు.