హుటాహుటిన హస్తినకు వెళ్లిన జనసేనాని... సర్వత్రా ఆసక్తి...

pawan2
ఠాగూర్| Last Updated: శనివారం, 11 జనవరి 2020 (15:12 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆదివారం అత్యవసరంగా హస్తినకు బయలుదేరి వెళ్లారు. ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన పవన్.. సమావేశం మధ్యలో అర్థాంతరంగా లేచి ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం పవన్ హస్తిన అత్యవసర పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరోవైపు, రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతరైతులు గత 25 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళనను వైకాపా ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, రైతులు మాత్రం అవేం లెక్కచేయకుండా రాజధాని కోసం ఉద్యమిస్తున్నారు.

మరోవైపు, రాజధాని తరలింపును జనసేన పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పైగా, పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు... విస్తృత స్థాయి సమావేశాల్లో అమరావతి అంశాన్ని సీరియస్‌గా చర్చిస్తున్నారు. అమరావతిలో రైతుల పక్షాన నిలిచి, పోరాటం చెయ్యాలని జనసేన భావిస్తోంది.

త్వరలోనే విజయవాడలో కవాతు నిర్వహించే అంశంపై జనసేన ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రముఖుల అపాయింట్‌మెంట్‌ పవన్‌ కల్యాణ్‌కు ఖరారయిందని, అందుకే ఆయన హుటాహుటిన వెళ్లారని జనసేన నేతలు అంటున్నారు. ఆయన ఎవరిని కలుస్తారన్నదానిపై ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజధాని విషయంలో అవసరమైతే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలుస్తానని గతంలో ఆయన ప్రకటించిన విషయం తెల్సిందే.దీనిపై మరింత చదవండి :