శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (10:12 IST)

రాత్రికిరాత్రే మారిన రాజకీయం... కేంద్ర మంత్రివర్గంలోకి వైకాపా?!

రాత్రికి రాత్రి రాజకీయం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో, కేంద్ర క్యాబినెట్‌లోకి ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఎంపీలకు చోటుదక్కబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి గట్టి లాబీయింగ్‌తో ముఖ్యమంత్రి - ప్రధానమంత్రి మధ్య బుధవారం జరగబోతున్న రెండు గంటల పాటు కీలక సమావేశం జరుగనుంది. 
 
ఇందులో కేంద్ర క్యాబినెట్‌లోకి వైకాపా చేరటానికి జగన్ మోహన్ రెడ్డి తన అంగీకారం తెలియచేయబోతున్నట్టు సమాచారం. విజయసాయి రెడ్డి సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలోనూ, అలాగే బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన నందిగం సురేష్ మరొక సహాయమంత్రిగానూ కేంద్ర క్యాబినెట్లో చేరబోతున్నట్టు సమాచారం.
 
అసలిక ఎలాంటి పరిస్థితుల్లోనూ, వైకాపాకి బీజెపికి మధ్య సయోధ్య కుదరకపోవచ్చుననీ, ఈ నేపథ్యంలో బీజేపీతో జట్టు కట్టిన జనసేనను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో మరోసారి వ్యూహాత్మక రాజకీయం నడపవచ్చుననీ భావించిన తెలుగు దేశానికి, ఈ తాజా పరిణామం కొంచెం మింగుడు పడని అంశంగా చెప్పుకోవచ్చు. 
 
వాస్తవానికి లోగడ రెండు సందర్భాల్లోనూ.. ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనూ, అమిత్ షాతోనూ అపాయింట్మెంట్ దొరకక వెనుదిరిగిన జగన్ మోహన్ రెడ్డి, ఆ తర్వాత అపాయింట్మెంట్ కోసం కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ లోపు, బీజేపీ రాజ్య సభ్యుడు సుజనా చౌదరికి, అలాగే వైఎస్ఆర్సీపీ  రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాసిన లేఖల పర్యవసానంగా బీజేపీకి, వైకాపాకు మధ్య సయోధ్య చెడిందనే అందరూ భావించారు.
 
ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకావటం, విజయసాయి రెడ్డి గట్టిగా లాబీయింగ్ చేయటంతో మొత్తానికి... ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రుల మధ్య జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకోనుంది. కీలకమైన బిల్లులను రాజ్యసభలో పాస్ చేయించుకోవాలంటే, బీజేపీకి అనివార్యంగా ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం. దానికితోడు, మార్చిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికవుతారు కాబట్టి, అది రాజ్యసభలో 'ఆపత్కాలం'లో బీజీపీకి అనుకూలించే అంశం. అందుకే వైకాపాను దగ్గరకు చేరదీసినట్టు సమాచారం.