బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (10:23 IST)

2025 డిసెంబర్ నాటికి బందర్ పోర్టు పనులు పూర్తి - చంద్రబాబు

Chandra Babu Naidu
2025 డిసెంబర్ నాటికి బందర్ పోర్టు పనులు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరుగుతున్న ఓడరేవు పనుల పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 
 
పోర్టుకు అవసరమైన మరో 38.32 ఎకరాల భూమిని త్వరలో కేటాయిస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రూ.3,669 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పోర్టు పనుల్లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఎలాంటి పురోగతి లేదని నాయుడు ఆరోపించారు.
 
ప్రస్తుతం జరుగుతున్న పనులు పూర్తయితే మొదటి నాలుగు బెర్త్‌లు సిద్ధమవుతాయని, అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం 16 బెర్త్‌ల వరకు ఏర్పాటు చేయవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.
 
ఓడరేవు పనులు పూర్తయితే అమరావతి రాజధాని నగరానికి అతి సమీపంలో ఉన్న మచిలీపట్నం అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతానికి అవసరమైన రోడ్డు కనెక్టివిటీ, పోలీసు శిక్షణా కేంద్రం, నీటి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
 
ఓడరేవును కంటైనర్‌ పోర్టుగా మారుస్తే తెలంగాణ వంటి పొరుగు రాష్ట్రాలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బందర్ పోర్టు కోసం దశాబ్దాలుగా జరుగుతున్న ఆందోళనలను గుర్తు చేస్తూ.. ప్రాధాన్యతను గుర్తించి తాను పనులు ప్రారంభించగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ పోర్టు పనులను పూర్తిగా విస్మరించిందని అన్నారు.