అనకాపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్సు రైలు... అనేక రైళ్లు రద్దు
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళుతున్న ఈ రైలు తాడి - అనకాపల్లి మార్గంలో పట్టాలు తప్పింది. మొత్తం ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన కారణంగా ట్రాక్ దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో నడిచే అనేక ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.
రద్దు చేసిన రైళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి గుంటూరుకు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌తో పాటు రత్నాచల్ - ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అలాగే, గుంటూరు నుంచి విశాఖ వైపు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలును మాత్రం మూడు గంటలు ఆలస్యంగా నడిపిస్తున్నారు. మరోవైపు, రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టి, త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టిసారించారు.