ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (12:54 IST)

బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాడె కట్టాలి : వామపక్ష నేతల పిలుపు

cpinarayana
రాష్ట్ర ప్రజలకు తీవ్ర ద్రోహం చేయడమే కాకుండా, తొమ్మిదేళ్ల విజయోత్సవ వేడుకల పేరుతో సభలు నిర్వహిస్తూ, ప్రజలను మరోమారు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి ఏపీ ప్రజలు పాడెకట్టాలని వామపక్ష పార్టీ నేతలు పిలుపునిచ్చారు. 
 
సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో బీజేపీ 9 ఏళ్ల విద్రోహ పాలనను నిరసిస్తూ ఆదివారం విశాఖ డీఆర్ఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని రకాలుగా ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. ఇది చాలక విజయోత్సవం పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖలో సభ నిర్వహించడం సిగ్గుచేటన్నారు. 
 
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేది లేదని అమిత్ షా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, కొత్త కార్మిక చట్టం రద్దు వంటి నిర్ణయాలను తక్షణమే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.