సోమవారం, 28 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2024 (20:40 IST)

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే లైనుకి రూ. 2,245 కోట్లు, కేంద్ర కేబినెట్ ఆమోదం

Funds to Amaravati Railway line
అమరావతి రైల్వే లైన్‌కు తొలి అడుగులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలను పెంపొందించే క్రమంలో, రాష్ట్ర నూతన రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంతకుమునుపే ఆమోదించబడిన ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీని మెరుగుపరచడం, ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధిని పెంచడం లక్ష్యంగా కేంద్రం రూ.2,245 కోట్లు కేటాయించింది.
 
Amaravati Railway line
ఈ కొత్త రైలు మార్గం 57 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనంగా కృష్ణా నదిపై 3 కిలోమీటర్ల వంతెన నిర్మించనున్నారు.
 
ఐదేళ్లుగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పట్టించుకోని రాజధాని రైల్వేలైన్‌కు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాది నిధులు కేటాయించారు. ఈ సంవత్సరం ఇప్పటికే రూ. 50.01 కోట్లు కేటాయించారు, దీనితో సత్వరమే రైల్వే లైనుకి సంబంధించి పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతి రైల్వే ప్రాజెక్టుతో పాటు గుంటూరు రైల్వే డివిజన్‌కు సంబంధించి కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కూడా కేంద్రం నిధులు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టులకు రూ. 1,100 కోట్లకు పైగా నిధులు కేటాయించడంపై రైల్వే వర్గాలు, ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.