మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

సరిహద్దుల వద్ద అశాంతి వద్దు : చైనాకు తేల్చిచెప్పిన ప్రధాని మోడీ

indochina talks
భారత్, చైనా దేశాల సరిహద్దుల వద్ద ఎలాంటి అశాంతి వద్దని చైనాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. రష్యా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత్ - చైనా దేశాధినేతలు సమావేశమయ్యారు. ఐదేళ్ల తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించి, ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. భారత్ చైనా భేటీని చారిత్రాత్మక భేటీగా ఇరు దేశాలు అభివర్ణిస్తున్నాయి. పైగా, 2019లో తర్వాత వీరిద్దరూ అధికారిక ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే మొట్టమొదటిసారి. ఈ సందర్భంగా ప్రధాన మోడీ, అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
 
ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, చైనా అధినేత జీ జిన్‌పింగ్‌తో సమావేశం కావడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఐదేళ్ల తర్వాత తమ మధ్య ఈ భేటీ జరిగిందని గుర్తుచేశారు. భారత్ - చైనా సంబంధాల ఆవశ్యకత ఇరు దేశాల పౌరులకు మాత్రమే ప్రయోజనకరం కాదని, ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల సమస్యలు అన్నింటిపై మాట్లాడే అవకాశం తమకు ఇవాళ దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. సానుకూలంగా, నిర్మాణాత్మకంగా ఈ చర్చలు ముందుకు సాగుతాయని విశ్వసిస్తున్నట్టు మోదీ చెప్పారు.
 
ముఖ్యంగా ఇరు దేశారు సరిహద్దుల వద్ద ఎలాంటి అశాంతి నెలకొనకుండా గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యలపై ఏకాభిప్రాయం కుదరడాన్ని స్వాగతిస్తున్నామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరిహద్దు వెంబడి శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడం తమ ప్రాధాన్యతగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇరుదేశాలు పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం ప్రాతిపదికన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. 
 
చైనా ప్రధాని జీ జిన్‌పింగ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీని కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఐదేళ్ల తర్వాత తొలి అధికారిక ద్వైపాక్షిక సమావేశం ఇదేనన్నారు. ఇరుదేశాలకు చెందిన ప్రజలు, అంతర్జాతీయ సమాజం అంతా ఇటువైపు చూస్తున్నారని అన్నారు. ఇరుదేశాలకు పురాతన నాగరికతలు ఉన్నాయని, రెండూ అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశాలేనని గుర్తుచేశారు. ఇరుదేశాలు కీలకమైన దక్షిణ దేశాలుగా ఉన్నామని అన్నారు. ఆధునికీకరణ పురోగతిలో ముఖ్యమన దశలో ఉన్నామని జినింగ్ ప్రస్తావించారు. ఇరు దేశాల చరిత్ర, ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలో కొనసాగించడం ఇరుదేశాలకు, పౌరుల ఆసక్తులకు ప్రయోజనకరమని అన్నారు.