హర్యానా ముఖ్యమంత్రి పగ్గాలు నాయబ్ సింగ్‌కే...
హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోమారు నాయబ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన పేరును భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. గత పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్న నాయబ్ సింగ్‌పై బీజేపీ అధిష్టానం నమ్మకం ఉంచి సీఎం పగ్గాలను మరోమారు ఆయనకే అప్పగించింది. దీంతో ఆయన ఈ నెల 17వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం పంచకులలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అదే రోజున కొత్త మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుందని కేంద్ర మంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.
కాగా, మొత్తం 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 సీట్లలో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలు, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ 2, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యుల మద్దతు కావాల్సివుండగా, నేషనల్ లోక్‌దళ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులతో పాటు మరో ముగ్గురు సభ్యులు మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.