శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (15:05 IST)

ఆర్టీసీకి డొక్కు బస్సులు - సీఎం కాన్వాయ్ కోసం రూ.20 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ బస్సులు

apsrtc
ఏపీఎస్ ఆర్టీసీ సంస్థకు చెందిన బస్సులన్నీ పాడైపోయాయి. ఈ సంస్థకు గత నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క బస్సు కూడా కొత్తది కొనుగోలు చేయలేదు. కానీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తన కాన్వాయ్ కోసం రూ.20 కోట్ల వ్యయంతో రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను ఏపీ సర్కారు కొనుగోలు చేసింది. గత యేడాది రూ.5 కోట్ల వ్యయంతో కొత్త కాన్వాయ్ కోసం కార్లను కొనుగోలు చేశారు. ఇపుడు రూ.20 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ బస్సులను కొనుగోలు చేయడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లుగా ఆర్టీసీ బస్సుల కండిషన్ దారుణంగా ఉంది. కాలం చెల్లిన డొక్కు బస్సులతో నాలుగున్నరేళ్లుగా ప్రజల చూస్తున్నారు. బస్సులు రన్నింగుల్లో ఉండగానే స్టీరింగ్లు, చక్రాలు, యాక్సిల్స్ ఊడిపోవడం, గమ్యస్థానానికి చేరకముందే మార్గమధ్యలో ఆగిపోవడం, బ్రేకులు విఫలమై పొలాల్లోకి, పంట కాల్వల్లోకి దూసుకుపోవడం.. వంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. అయినా ప్రయాణికుల క్షేమంపై వైకాపా సర్కారు దృష్టిపెట్టలేదు. కొత్త బస్సుల కొనుగోలుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. 
 
కానీ, ఆర్టీసీ మాత్రం.. సీఎం జగన్ కోసం ఏకంగా రూ.20 కోట్లు వెచ్చించి కొత్తగా రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను కొనుగోలుచేసింది. సీఎం పర్యటనల కోసం ఇప్పటికే ఆర్టీసీ వద్ద రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉండగా, వాటి స్థానంలో కొత్తవి తీసుకుంది. మరో రూ.3 కోట్లు వెచ్చించి మూడు నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కూడా కొనుగోలు చేసింది. వీటిలో రెండు నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఆదివారం విజయవాడ చేరుకున్నాయి. మిగిలినవి ఈ వారంలోనే నగరానికి రానున్నాయి. 
 
మరో పది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. తర్వాత దాదాపు రెండు నెలలపాటు ఎన్నికల ప్రచారమే ఉంటుంది. దీంతో సీఎం ప్రచారానికి ఉపయోగించేందుకు వీలుగా.. ప్రజలు టికెట్ల రూపంలో ఆర్టీసీకి చెల్లించిన సొమ్ముతో ఈ బస్సులు కొనుగోలు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల ఆదేశాలతోనే సీఎం పర్యటనలకు వినియోగించే బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తుందని, వీటిని వినియోగించుకున్నందుకు ప్రత్యేక టారిఫ్ ఉంటుందని, దాని ప్రకారం సర్కారు ఆర్టీసీకి సొమ్ము చెల్లిస్తుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.