శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 8 మార్చి 2021 (20:01 IST)

పురుషులతో సమానంగా పోటీ పడగల సత్తా మగువలది: ఏపి ప్రధమ పౌరురాలు గౌరవ సుప్రవ హరిచందన్

తగిన అవకాశాలు లభిస్తే మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడగలుగుతారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వారి సతీమణి, రాష్ట్ర ప్రధమ పౌరురాలు సుప్రవ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌లో సోమవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
 
దేశ అభివృద్ధిలో స్త్రీలకు సమానమైన పాత్ర ఉందని ప్రపంచానికి తెలియజేసే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం భావించవచ్చని ఈ సందర్భంగా సుప్రవ హరిచందన్ అన్నారు. ఈ రోజు మహిళలందరికీ చాలా ముఖ్యమైన రోజని, దశాబ్దాలుగా సాగిన మహిళా ఉద్యమాల ఫలితంగా సాధించిన సమాన హక్కులను పరిరక్షించుకోవలసిన బాధ్యతను మనకు గుర్తు చేస్తుందన్నారు.
ఈ సంతోషకరమైన క్షణాలను మీ అందరితో పంచుకోవడానికి తనకు అవకాశం లభించటం ముదావహమన్నారు. కార్యక్రమానికి రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి నాగమణి అధ్యక్షత వహించగా, ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు సుప్రవ హరిచందన్ బహుమతులు అందచేసారు. కేక్ కట్ చేసి రాజ్ భవన్ మహిళా ఉద్యోగులకు స్వయంగా అందించారు. రాష్ట్ర ప్రధమ పౌరురాలిని రాజ్ భవన్ మహిళా ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.