బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (13:09 IST)

భర్త మంచోడే... సుఖంగా కాపురం... మరి దంతవైద్యురాలు ఎందుకు ఆ పని చేసింది...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ దంత వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్థికంగా బాగా ఉన్నత కుటుంబం. పైగా, భర్త మంచోడు. సుఖమైన సంసార జీవితాన్ని అనుభవిస్తూ వచ్చిన ఆ మహిళా వైద్యురాలు బలవన్మరణానికి ఎందుకు పాల్పడిందన్న విషయం ఎవరికీ అంతు చిక్కడం లేదు. 
 
ఇటీవల వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మణ్ కిశోర్, గుంటూరుకు చెందిన మాధవీలత, 20 ఏళ్ల క్రితం ప్రేమించుకుని, కులాంతర వివాహం చేసుకున్నారు. వారిద్దరూ నంద్యాలకు వచ్చి, ఓ కాస్మోటిక్ దంత వైద్యశాలను ప్రారంభించి, సుఖంగా కాపురం చేసుకుంటున్నారు. ఇక్కడే ఇల్లు కూడా కొనుక్కొని స్థిర పడ్డారు. ఆర్థికంగా కూడా వారికి ఎలాంటి ఇబ్బందులూ లేవని తెలుస్తోంది.
 
అయితే, ఈ నెల 16వ తేదీన మాధవీలత ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆమె భర్త మంచివాడని, తన కుమార్తెను చాలా బాగా చూసుకుంటాడని మాధవీలత తండ్రి చెబుతుండటంతో, ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏంటన్న విషయమై పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. 
 
పైగా, ఆమె మృతదేహం వద్ద ఓ సూసైడ్ నోట్ లభించగా, అందులో ఏముందన్నది ఇప్పటివరకూ బయటకు రాలేదు. కేసు విచారణలో భాగంగా దాన్ని బయట పెట్టడం లేదని పోలీసులు అంటుండగా, అందులో ఏదో పెద్ద విషయమే ఉందన్న చర్చ జరుగుతోంది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే, కేసు విచారణ సాగుతోందని నగర రెండో పట్టణ సీఐ వెల్లడించడం గమనార్హం.