శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (12:46 IST)

కర్రీ పాయింట్లకు వృత్తిపన్ను.. డ్యాన్సర్లు - జూ.ఆర్టిస్టులపై కూడా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ పథకాల కింద ప్రతి కుటుంబానికి అనేక రూపాల్లో నగదు పంపిణీ చేస్తోంది. దీంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. దీంతో ఇతర ఆదాయ మార్గాలపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు దృష్టిసారించింది. ఇందులోభాగంగా, సినిమా నిర్మాతపై పన్ను!  ఆ నిర్మాత తీసే సినిమాలో జూనియర్‌ ఆర్టిస్టులపై అదే పన్ను! డ్యాన్సర్లపైనా పన్ను! కూరలు విక్రయించే కర్రీ పాయింట్లపైనా పన్ను! ఈ పన్నుబాదుడు మామూలుగా లేదు. ఇప్పటివరకు రూ.1250 ఉన్న పన్నును ఏకంగా రూ.2 వేలు నుంచి రూ.2500 పెంచేసింది. పైగా కర్రీ పాయింట్లు కూడా వృత్తి పన్ను చెల్లించాల్సిందేనంటూ షరతు విధించింది. దీంతో చిరు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. 
 
ఆర్థిక కష్టాల్లో సతమతమవుతున్న సీఎం జగన్ సర్కారు నిధుల వేటకు పూనుకుంది. సంక్షేమ పథకాల కోసం నిధులు కావాలి అని సూటిగానే చెబుతూ కొత్త పన్నుల కొరడా ఝళిపించింది. వృత్తి పన్ను విధింపును క్రమబద్ధీకరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు పన్ను వసూలుకు పకడ్బందీగా నిబంధనలు రూపొందిస్తూ మరో జీవోను జారీ చేసింది. 
 
వృత్తి పన్ను చెల్లిస్తేనే లైసెన్సులు, రెన్యువల్స్‌, ఇతర అనుమతులు ఇవ్వాలంటూ సంబంధిత శాఖలన్నింటినీ ఆదేశించింది. నిర్మాత నుంచి జూనియర్‌ ఆర్టిస్టు దాకా సినిమా, టీవీ పరిశ్రమకు సంబంధించిన వారెవరినీ వదలకుండా అందరిపైనా ఏకరీతిన రూ.2500 వృత్తి పన్ను విధించారు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, డైరెక్టర్లు, సినిమాటోగ్రఫీ ఫిల్మ్‌ ప్రాసెసర్లు, ఫొటోగ్రఫీ డైరెక్టర్లు, మ్యూజిక్‌ డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు, గీత రచయితలు, నటులు, కథా రచయితలు, గాయకులు, రికార్డిస్టులు, ఎడిటర్లు, ఔట్‌డోర్‌ ఫిల్మ్‌ యూనిట్లు, అసిస్టెంట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లు, కెమెరామెన్లు, స్టిల్‌ ఫొటోగ్రాఫర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ కెమెరామెన్లు, అసిస్టెంట్‌ రికార్డిస్టులు, అసిస్టెంట్‌ ఎడిటర్లు, డ్యాన్సర్లు... ఇలా ప్రతి ఒక్కరూ రూ.2,500 వృత్తిపన్ను చెల్లించాలని జీవోలో పేర్కొన్నారు.
 
వృత్తి పన్ను చెల్లింపుదారుల జాబితాలోకి కొత్తగా కర్రీ పాయింట్లను చేర్చారు. క్యాంటీన్లు, రెస్టారెంట్లు, టేక్‌ అవే ఫుడ్‌ పాయింట్ల సరసన కర్రీ పాయింట్లను కూడా చేర్చి ఏడాదికి రూ.2500 వృత్తి పన్ను చెల్లించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఏదైనా సంస్థ నుంచి రెమ్యునరేషన్‌ పొందుతున్న వారూ పన్ను చెల్లించాలని జీవోలో పేర్కొన్నారు. వీడియో క్యాసెట్లకు కాలం ఎప్పుడో చెల్లింది. డీవీడీలు, సీడీలు అద్దెకు ఇచ్చే వారూ లేరు. అయినా సరే... వీడియో క్యాసెట్లు, డీవీడీ, సీడీ లైబ్రరీలను కూడా వృత్తి పన్ను పరిధిలోకి తెచ్చారు. వే బ్రిడ్జి నిర్వాహకులూ ఏటా రూ.2500 వృత్తి పన్ను చెల్లించాలని ఆదేశించారు. 
 
ఇక... ఏడాదికి రూ.10 లక్షల నుంచి నుంచి 25 లక్షల టర్నోవర్‌ చేస్తున్న కాంట్రాక్టర్లు రూ.2000, అంతకు మించిన వారు రూ.2500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల టర్నోవర్‌ సాధించే హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, లాడ్జిల యజమానులు, లీజుదారులకు రూ.2000 అంతకుమించి టర్నోవర్‌ ఉన్న వారికి రూ.2500 ఖరారు చేశారు. 
 
ఏపీ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ చట్టం 1964 కింద జిల్లా, రాష్ట్ర స్థాయి సొసైటీలకు రూ.2500 వృత్తిపన్ను విధించారు. 2013లో చివరిగా వృత్తి పన్ను రేట్లు సవరించి వాటిని 2 శ్లాబులుగా వర్గీకరించారు. మొదటి శ్లాబులోకి వచ్చే వారు ఏడాదికి రూ.1200, రెండో శ్లాబులోకి వచ్చే వారు రూ.2500 పన్ను కట్టాల్సి ఉండేది. ఇప్పుడు అందరినీ ప్రభుత్వం రూ.2000 నుంచి రూ.2500 కిందకు తీసుకొచ్చింది.