ఒడ్డున కూర్చొన్న కర్నూలు విద్యార్థి... సముద్రంలోకి లాక్కెళ్ళిన అలలు
ఇటలీలో విషాదం జరిగింది. ఒడ్డున కూర్చొనివున్న కర్నూలుకు చెందిన దిలీప్ అనే విద్యార్థిని రాక్షస అలలు సముద్రంలోకి లాక్కెళ్లాయి. దీంతో ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెల్సిందే. అతని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణంలోని స్థానిక బాలాజీ నగర్, బాలాజీ అపార్టుమెంటులో నివశిస్తున్న శ్రీనివాసరావు, శారద దంపతుల పెద్ద కుమారుడు దిలీప్ (24). ఇటలీలోని మిలాన్ యూనివర్శిటీల ఎంఎస్సీ అగ్రకల్చర్ చదువుతున్నాడు.
గత 2019 సెప్టెంబరులో మిలాన్ వెళ్లిన దిలీప్ గత యేడాది ఏప్రిల్ నెలలో కర్నూలుకు వచ్చాడు. ఆ తర్వాత కరోనా కారణంగా రెండేళ్లుగా ఇంటిపట్టునే ఉన్నాడు. గత యేడాదిలో విద్యా సంస్థలు తెరవడంతో సెప్టెంబరులో మళ్లీ ఇటలీకి వెళ్లాడు. పైగా, కోర్సును పూర్తి చేసిన దిలీప్.. ఉద్యోగం సంపాదించుకుని కర్నూలుకు వస్తానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంతలోనే మృత్యువు కబళించింది.
చదువు పూర్తికావడంతో శుక్రవారం మాంటెరుస్సో బీచ్‌కు వెళ్లాడు. సాయంత్రం వరకు అక్కడే ఉన్న దిలీస్ సముద్రపు ఒడ్డున కూర్చని సేదతీరుతున్నాడు. అయితే, ఏమరపాటుతో ఒడ్డున కూర్చొనివున్న దిలీప్‌ను ఓ రాక్షస అల వచ్చి సముద్రంలోని లాక్కొనివెళ్లిపోయింది.
ఆ వెంటనే అప్రమత్తమైన కోస్ట్ గార్డ్ సిబ్బంది దిలీప్‌ను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. మరుసటి రోజు అతని మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.