ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (13:36 IST)

జగనన్నా.. జీతాలు ఎక్కడ : ఫిబ్రవరి 6 దాటినా ఉద్యోగులకు పడని వేతనాలు

call money
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు జీతాలు మహాప్రభో అంటూ ఆ రాష్ట్ర సర్కారును ప్రాధేయపడుతున్నారు. జగనన్నా.. మా జీతాలు ఎక్కడ అంటూ అడుగుతున్నారు. జనవరి నెల వేతనం ఇంకా చాలా మందికి పడలేదు. ఫిబ్రవరి ఆరో తేదీ అయినప్పటికీ ఇప్పటివరకు ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడలేదు. దీంతో నెలవారి ఈఎంఐలు చెల్లించాల్సిన వారు లబోదిబో మంటున్నారు. 
 
ఏపీ సర్కారు ప్రతి నెల జీతభత్యాల కోసం రూ.6 వేల కోట్ల మేరకు చెల్లించాల్సివుంది. కానీ, ఇప్పటివరకు కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.4 వేల కోట్లు ఎపుడు వేస్తారో తెలియదు. దీంతో మిగిలిన ఉద్యోగులకు ఎపుడు వేతనాలు వస్తాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయం సెక్షన్ అధికారుల సంఘం అధ్యక్షుడు రంగాస్వామి ఆధ్వర్యంలో ఆసంఘం ప్రతినిధులు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డినికలిసి వినపతిపత్రం సమర్పించారు. ఆర్థిక శాఖ అధికారులకూ ఇచ్చారు. ఉద్యోగుల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డిని వారు విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, ఇప్పటివరకు వేతనాలు ఉద్యోగుల ఖాతాల్లో జమకాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇంటి అద్దె, ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు, ఈఎంఐలు చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని వారు వాపోతున్నారు. సచివాలయంలో ఆర్థిక, సాధారణ పరిపాలన, అసెంబ్లీ విభాగాలకు చెందిన ఉద్యోగుకు జీతాలు అందాయి. మిగిలిన వారికి మాత్రం ఇంకా చెల్లించలేదు. 
 
ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది వ్యక్తిగత గృహ రుణాలు తీసుకున్నవారే ఉంటున్నారు. వారు ఐదో తేదీ లోగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతినెలా జాప్యం కారణంగా సకాలంలో ఈఎంఐలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. దీనివల్ల తమ క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందని వారు వాపోతున్నారు. మొత్తంమీద ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ పగటిపూటే చుక్కలు చూపిస్తున్నారు.