గ్యారెంటీ అప్పుల్లో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మరో రికార్డు సాధించింది. గ్యారెంటీ అప్పుల్లో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ విషయాన్ని భారత రిజర్వు బ్యాంకు వెల్లడించింది. 2021-22లో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ రుణాలను రూ.1,17,503 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది.
2021-22లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసి రూ.25,000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ గ్యారెంటీ అప్పులను ఆ ఏడాది బడ్జెట్ అంచనాల్లో చూపలేదు. బడ్జెట్ పుస్తకాల్లోని వివరాల ప్రకారం, 2022 డిసెంబరు నాటికి ప్రభుత్వం రూ.2,02,470 కోట్లకి గ్యారెంటీ ఇచ్చింది. వీటిలో రూ.1,38,874 కోట్లు వినియోగించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఇచ్చిన గ్యారెంటీల మొత్తంలో దాదాపు రూ.1,88,874 కోట్లు ప్రభుత్వం వాడేసింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది.
ఇక, కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కి కూడా అప్పులపై పూర్తి వివరాలు వెల్లడించక పోవడం గమనార్హం. నాలుగున్నరేళ్ల నుంచి కార్పొరేషన్ అప్పుల వివరాలు కావాలంటూ కాగ్ అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాస్తవ గణాంకాల ఆధారంగా కాకుండా అంచనాలను పరిగణనలోకి తీసుకోవడంతో ఏపీకి గ్యారంటీ అప్పుల్లో టాప్-3 ర్యాంకు వచ్చిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే ఏపీ మొదటి స్థానంలో ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక, గ్యారెంటీ అప్పుల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉంది.