సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (15:36 IST)

జూనియర్ న్యాయవాదులకు బ్యాంకు ఖాతాల్లో రూ.30 వేలు జమ

jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ లా నేస్తం ఒకటి. ఈ పథకం కింద అర్హులైన యువ న్యాయవాదులకు ప్రభుత్వం సోమవారం నిధులను విడుదల చేసింది. ఒక్కో లబ్ధిదారుడికి రూ.30 వేల చొప్పున నిధులను వారివారి బ్యాంకు ఖాతాల్లోకి సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ బటన్ నొక్కి వైఎస్ఆర్ లా నేస్తం విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు చొప్పున అందజేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.7.98 కోట్లను విడుదల చేస్తుంది. కొత్తగా న్యాయ కోర్సును పూర్తి చేసిన జూనియర్ న్యాయవాదులు మూడేళ్ళపాటు వృత్తిలో కొనసాగేలా యేడాదికి రూ.60 వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తున్నారు. 
 
అలాగే, న్యాయవాదులు సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు రుణాలు, గ్రూపు మెడికల్ పాలసీలను ఇచ్చింది. ఇలా ఇప్పటివరకు రూ.25 కోట్ల నిధులను వైకాపా ప్రభుత్వం విడుదల చేసింది.