బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (11:57 IST)

వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీలు

‘మనబడి నాడు-నేడు’ కింద రెండో విడత పనులు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘మనబడి నాడు– నేడు, జగనన్న విద్యా కానుక’పై  సమీక్ష నిర్వహించారు.

రెండో విడతలో భాగంగా ప్రైమరీ పాఠశాలలు 9,476, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లు 822, రెసిడెన్షియల్‌ స్కూళ్లు సహా హైస్కూళ్లు 2,771, జూనియర్‌ కాలేజీలు 473, హాస్టళ్లు 1,668, డైట్‌ కాలేజీలు 17, ఎంఆర్‌సీఎస్‌ 672, భవిత కేంద్రాలు 446 చోట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్.రావత్, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజా శంకర్, మహిళా శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, సర్వ శిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

టాయిలెట్ ‌కేర్‌టేకర్‌..
* ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు దీనికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు కేర్‌ టేకర్‌కు సగటున రూ.6 వేలు చెల్లింపు. టాయిలెట్లను శుభ్రపరిచే సామగ్రితో కలుపుకుని ఒక్కో స్కూలుకు రూ.6,250 నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా. పిల్లల సంఖ్యను అనుసరించి నలుగురు వరకు టాయిలెట్ల కేర్‌ టేకర్లు. వేయికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో నలుగురు కేర్‌ టేకర్లు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. 
 
అంగన్‌వాడీలు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు – నేడు కింద చేపట్టనున్న కార్యక్రమాలపైనా  సీఎం సమీక్ష నిర్వ‌హించారు. మార్చి 2021లో మొదటి దశ పనులు మొదలుపెట్టాలని నిర్ణయం. రెండున్నరేళ్లలో మొత్తం పనులు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం.

మొదటి విడతలో 6,407 కొత్త అంగన్‌వాడీల నిర్మాణం, 4,171 అంగన్‌వాడీల్లో అభివృద్ధి పనులు. మొత్తం 27,438 కొత్త అంగన్‌వాడీ భవనాల నిర్మాణం. 16,681 చోట్ల అభివృద్ధి పనులను చేపడుతున్న ప్రభుత్వం. మొత్తంగా సుమారు రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా. 
 
వైఎస్సార్‌ ప్రీప్రైమరీలు..
వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లగా అంగన్‌వాడీలు. ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం రూపొందించిన పుస్తకాలను సీఎంకు  మంత్రి, అధికారులు చూపించారు. పిల్లలకు జిజ్ఞాస పెంచేలా, బోధన కోసం ప్రత్యేక వీడియోలు రూపొందించామన్న అధికారులు.
పుస్తకాల నాణ్యత బాగుండాలని అధికారులకు సీఎం ఆదేశాలు  జారీ చేశారు.