సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జనవరి 2021 (12:55 IST)

కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం : పోలీసుల దిగ్బంధంలో రామతీర్థం

ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆలయాల్లోని విగ్రహాల ధ్వంస రచన పరంపర కొనసాగుతూనే ఉంది. రామతీర్థం ఘటన ఉద్రిక్తతలు చల్లారక ముందే విజయవాడలో బస్టాండ్ సమీపంలోని ఆలయంలో సీతమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. 
 
బస్టాండ్‌లోని నర్సరీ వద్ద ఉన్న పురాతన సీతారామ మందిరంలోని సీతాదేవి విగ్రహాన్ని విగ్రహం ధ్వంసం చేశారు. గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకొని విగ్రహాలను పరిశీలించారు. 
 
అయితే ఘటన గురించి తెలుసుకొని ఆలయం వద్దకు ఆర్టీసీ ఉద్యోగులు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. టీడీపీ నేత పట్టాభిరాం చేరుకొని సీతాదేవి విగ్రహం ధ్వంసం ఘటనపై విచారణ జరపాలని పోలీసులను కోరారు. 
 
ఎలుకలు, లేదంటే గాలి ద్వారా విగ్రహం ధ్వంసమై ఉంటుందని సీఐ సత్యానందం పేర్కొన్నారు. సీఐ సమాధానంపై టీడీపీ నేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జరుపకుండా ఎలా నిర్ధారణకు వస్తారని ప్రశ్నించారు. సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
 
మరోవైపు, ఏపీలో రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన రామతీర్థం ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడి దేవాలయంలో విగ్రహం ధ్వంసం కావడం, రాజకీయ రంగు పులుముకుని, ప్రధాన పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10 గంటల సమయంలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి తదితరులు సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
ఇక్కడి రామస్వామి ఆలయంలో శ్రీరాముని విగ్రహం తలను ఖండించిన దుండగులు, దాన్ని కోనేరులో పడవేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఏపీ ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీ విరుచుకుపడుతుండగా, వైసీపీ నేతలు మాత్రం తెలుగుదేశం వారే ఈ పని చేయించారని విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ క్రమంలో మంత్రులు ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకోగా, వారిని అడ్డుకునేందుకు టీడీపీ స్థానిక నేతలు ప్రయత్నించవచ్చని నిఘా వర్గాలు తెలపడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.