బుధవారం, 18 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2024 (14:45 IST)

అర్థరాత్రి సీఎం చంద్రబాబు రిస్క్ చేసినా.. నిర్లక్ష్యం వీడని అధికారులు...

chandrababu
విజయవాడ నగరంలో వరద నీటిలో మునిగిపోయింది. అనేక ప్రాంతాలు, కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వరద బాధిత ప్రాంతాల్లో బోటులో ప్రయాణం చేస్తూ బాధితులకు ఆహారం, నీళ్లు అందేలా పర్యవేభిస్తున్నారు. ఇందుకోసం ఆయన అర్థరాత్రి పూటా వరద నీటిలో ప్రయాణించారు. ఆయన వ్యక్తం భద్రతా సిబ్బంది.. భద్రత దృష్ట్యా వద్దని చెప్పి వినకుండా సీఎం బాబు రిస్క్ తీసుకున్నారు. 
 
రిస్క్ తీసుకుని బోటులో ప్రయాణిస్తూ బాధితుల దగ్గరికి వెళ్లారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, భయాందోళనలు అక్కర్లేదని భరోసా కల్పించారు. వరదలో చిక్కుకున్న వారికి ఎప్పటికప్పుడు ఆహారం అందించడంతో పాటు ఇతరత్రా సాయం చేయాలని స్పష్టంగా ఆదేశాలిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.
 
అయితే, కొందరు అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడలేదు. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో వరదలో చిక్కుకుని తిండి, నీళ్లు లేక బాధితులు అలమటిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి వారికి ఎలాంటి ఆహారం అందలేదని, అధికారులు ఎవరూ కూడా అటువైపు తొంగిచూడలేదని  వారు ఆరోపిస్తున్నారు. ఇదేప్రాంతంలో సీఎం చంద్రబాబు ఆదివారం అర్థరాత్రి పర్యటించారు. బాధితుల కష్టాలను స్వయంగా చూశారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.
 
నిజానికి సీఎం ఆదేశాలతో సోమవారం ఉదయం ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక బాధితులైతే తీవ్రంగా మండిపడుతున్నారు. తిండి, నీరు అందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు వాకిలి వరదలో మునగడంతో నిరాశ్రయులుగా మారిన పలువురు హైవేలపైనే ఉంటున్నారు. తినడానికి తిండి సంగతి అటుంచి కనీసం కాలకృత్యాలు తీర్చుకునే సదుపాయం కూడా లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
 
అంతకుముందు ఆదివారం అర్థరాత్రంతా సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి బోటులో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన వరద బాధితులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. అర్ధరాత్రి 1.10 గంటలకు కృష్ణలంకలో ఆయన పర్యటించారు. త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందని బాధితులకు ధైర్యం చెప్పారు. 
 
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. రాత్రంతా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి బోటులో తిరుగుతూ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
 
ప్రధానంగా బుడమేరు వరదతో అస్తవ్యస్తమైన సింగ్ నగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఆదివారం అర్థిరాత్రి రెండోసారి పర్యటించడం గమనార్హం. అర్థరాత్రి 1.10 గంటలకు కృష్ణలంకలోని 16వ డివిజన్ పోలీసు కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా రక్షణ గోడ వద్ద వరద నీటిని పరిశీలించారు.
 
త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందని వరద బాధితులకు ధైర్యం చెప్పారు. అలాగే సింగ్ నగర్, కృష్ణలంక, ఫెర్రీ, ఇబ్రహీంపట్నం, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో వరద ఉద్ధృతిని పరిశీలించారు. అక్కడి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో సీఎం చంద్రబాబుపై పార్టీ శ్రేణులు, అభిమానులతో పాటు పలువురు సామాన్య ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
చంద్రబాబుతో పాటు ఎంపీ చిన్ని, మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, అనిత, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, కృష్ణప్రసాద్, కలెక్టర్ సృజన, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.