శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ , శనివారం, 22 జనవరి 2022 (11:32 IST)

ఏ ప్ర‌భుత్వోద్యోగికి ఎంత జీతం... లెక్క‌లు బోర్డులు పెట్టేయ‌నున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం

ప్రజల ముంగిట ప్రభుత్వోద్యోగుల వివరాలు... పారదర్శకత… జవాబుదారీతనం… సమాచార హక్కు…అంటూ ఏపీ సీఎం ప్ర‌భుత్వోద్యోగుల గుట్టు బ‌య‌ట‌పెట్టేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ప్ర‌భుత్వోగుల‌కు ఎంత జీతం ఇస్తోందీ... వారు ఏం ప‌నిచేస్తోందీ, ఎంత‌మంది ప‌నిచేస్తోందీ వివ‌రాలు ప్ర‌తి కార్యాల‌యం, పాఠ‌శాల ముందు బోర్డులు పెట్టేయాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. 
 
 
పారదర్శకత… జవాబుదారీతనం… సమాచార హక్కు… పై మూడు అంశాలనూ బాధ్యతగా తీసుకుని పరిపాలనలో గుణాత్మక మార్పులు తీసుకు వచ్చే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి పరిమిత కార్యాల‌యాల్లో అది కూడా ఆయా కార్యాలయాల్లో లభించే సేవలను మాత్రమే పేర్కొంటూ బోర్డులు ఉండేవి. 
 
 
ప్రధానంగా రెవెన్యూ కార్యాలయాలు, ప్రభువైద్యశాలల్లో మనం ఇటువంటి డిస్ ప్లే బోర్డులను చూసేవాళ్ళం. ఇలా కొన్ని ప్రభుత్వ శాఖల్లో తప్పితే అధిక శాతం శాఖల్లో అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరెవరు ఉంటారు? ఏ స్ధాయి అధికారులు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు? వారు ప్రజలకు  నిర్వర్తిస్తున్న విధులు బాధ్యతలు ఏంటి అనే సమాచారం సామాన్య ప్రజలకు తెలియదు.
 
అటువంటి ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమాచారం ప్రజలకు తెలియక పోవడం ఒకఎత్తైతే… సదరు ఉద్యోగులు ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించక పోవడం మరో ఎత్తు. తమకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరెవరు ఉద్యోగ బాద్యతలు నిర్వహిస్తున్నారు... వారితో ప్రజలు ఎటువంటి సేవలు పొందచ్చు వంటి కీలక సమాచారం ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందూ డిస్ ప్లే చెయ్యాలని ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
 
ఉదాహరణకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలం మొదలుకుని గ్రామ స్ధాయిలో ఉన్న ప్రాధమిక పాఠశాల వరకూ అన్నింటిలో అటెండర్ మొదలుకుని సిబ్బంది అందరి పూర్తి వివరాలతో కూడిన బోర్డులను ఆయా కార్యాలయాలు, పాఠశాలల ముందు పెట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బోర్డుల్లో అటెండర్ నుంచి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కార్యాలయ కాంపిటెంట్ అధారిటీ వరకూ అందరి వివరాలు వారికి వస్తున్న వేతనాలతో సహా సమస్త వివరాలు ఉంటాయి.
 
 
అలాగే మిగిలిన ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో కూడా ఇదే విధంగా సిబ్బంది సర్వీస్ వ్యవహారాలు, సేవలు, జీతభత్యాల వివరాలు ఉంచాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమగ్ర సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని వ‌ల్ల ఇక ప్ర‌భుత్వోద్యోగులు తాము తీసుకుంటున్న జీతానికి చేస్తున్న సేవ‌లు కూడా ప్ర‌జ‌ల‌కు తెలిసివస్తాయ‌నే భావం కూడా ఇందులో క‌నిపిస్తోంది.