శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 27 నవంబరు 2021 (16:46 IST)

పోలవరంపై పట్టుబట్టాలి.. ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ చేయాలి

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ.55,657 కోట్లకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించేలా పార్లమెంట్‌ సమావేశాల్లో పట్టుబట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. జాతీయ హోదా ప్రాజెక్టు అంటే విద్యుత్తు, సాగునీరు, తాగునీరు అంశాల కలయికని, అయితే ఎప్పుడూ లేనివిధంగా తాగునీటి అంశాన్ని విడదీసి చూస్తున్నారని పేర్కొన్నారు.
 
 
కాంపొనెంట్‌ వారీగా డబ్బులిస్తామని చెబుతున్నారని, కేంద్రం ఇంకా ఆమోదించాల్సిన డిజైన్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇబ్బందికర పరిస్థితులున్నప్పటికీ పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,104 కోట్లు ఖర్చు చేసిందని, అయితే ఆ డబ్బులను కేంద్రం ఇంకా రీయింబర్స్‌ చేయలేదన్నారు. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన పలు అంశాలపై ఎంపీలకు సీఎం జగన్‌ మార్గనిర్దేశం చేశారు.  జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత లేకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో పేదరికం ఎక్కువగా ఉందనే కోణంలో గణాంకాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇది వాస్తవ విరుద్ధం. ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తలసరి ఆదాయం చాలా తక్కువ కాబ‌ట్టి రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని కోరారు. 
 
 
ఏపీ సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి రూ.1,703 కోట్ల బకాయిలు రావాలని, రాష్ట్ర విభజన తర్వాత మన విద్యుత్‌ తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 6,112 కోట్ల బకాయి పడింది. వీటిని ఇప్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల‌న్నారు. 

 
రాష్ట్ర విభజన సమయంలో రీసోర్స్‌ గ్యాప్‌ (రెవెన్యూ లోటు) రూ.22,948.76 కోట్లు అయితే ఇచ్చింది రూ.4,117.89 కోట్లు మాత్రమే. రీసోర్స్‌ గ్యాప్‌ను 2014–15 బడ్జెట్‌ ద్వారా పూడుస్తామని చెప్పారు. కాగ్‌ ప్రకారం గ్యాప్‌ విలువ రూ.16,078.76 కోట్లు కాగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఎఫ్‌ లాంటి బకాయిలతో కలిపి లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. ఓవర్‌ బారోయింగ్‌ పేరుతో రుణాలు కత్తిరించడం అన్నది ఎప్పుడూ లేదు. చంద్రబాబు  హయాంలో చేసిన దానికి రుణాల్లో కత్తిరింపులకు దిగడం సరికాదు. గత ప్రభుత్వం పరిమితికి మించి రుణం సేకరించిందని తెలిసినప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఆనాడే ఎందుకు స్పందించలేదు? రుణాలను ఇప్పుడు ప్రభుత్వం సక్రమంగా తీరుస్తోంది. అలాంటప్పుడు నికర రుణ పరిమితిలో కోత విధించడం సరి కాద‌న్నారు. 
 
  
వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాల‌ని,  బీసీ కులాల వారీగా జనాభా లెక్కించేలా ఒత్తిడి తేవాల‌ని సీఎం సూచించారు. ఉపాధి హామీ కింద రాష్ట్రానికి రూ.4,976.51 కోట్ల బకాయిలు చెల్లించాల‌ని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశామ‌న్నారు.

 
‘‘మన ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచింది. మరో రెండేళ్ల తర్వాత ఎన్నికల కాలం వచ్చేస్తుంది. మన పార్టీకి అంటూ ఒక సిద్ధాంతం ఉంది. మనకంటూ సొంత బలం ఉంది. మనం ఏ కూటమిలోనూ లేం.. ఎవరి తరఫునా లేం.. మనది ప్రజల కూటమి. మనం ప్రస్తావించే ప్రతి అంశం కూడా ప్రజల తరఫునే. మనం వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ప్రజలకు మేలు జరిగే ఏ అంశం కోసమైనా మనం ముందడుగు వేయాలి. ఎంపీలు అంతా కలసికట్టుగా ముందుకు సాగాలి. సమష్టిగా రాష్ట్రం కోసం పనిచేయాలి. మనకంటూ బలం ఉంది... మన పార్టీకి ప్రతిష్ట ఉంది. ఆ ప్రతిష్టను నిలబెట్టేలా ప్రతి క్షణం ప్రజల కోసం పాటుపడాలి. ప్రజలకు మేలు జరిగే అంశాల్లో మనం ముందుకు అడుగు వేయాల‌ని ఎస్సార్‌ సీపీ ఎంపీలతో సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.