గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (16:26 IST)

రెండేళ్ళలోనే ఘోరంగా విఫలమయ్యారు.. జగన్ పాలన ఫ్లాప్ : ఉండవల్లి

కేవలం రెండేళ్ల కాలంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, అందుకే ఆయన వరుసగా రెండుసార్లు గెలిచారన్నారు. అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బాగా పరిపాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. 
 
కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళ కాలంలోనే అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. జగన్ పాలనలో అవినీతి లేదని ఎవరైనా చెప్పగలరా? అని ఉండవల్లి ఛాలెంజ్ చేశారు. సీఎం జగన్ పాలనలో అవినీతి రాజ్యమేలుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. 
 
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకునిపోయిందన్నారు. అప్పుల కోసం దేనికైనా అడ్డంగా తలూపుతున్నారన్నారు. ఇలాగే చేసుకుంటూ పోతే భవిష్యత్‌లో ఒక్కపైసా కూడా అప్పు ఇవ్వరన్నారు. అలాగే, అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరగకుండా సభను తప్పుదారిపట్టించారని ఆయన ఆరోపించారు.