కేంద్రం ఇచ్చిన మా పైసలివ్వండి... బొడ్డపాడు గ్రామ సభ సంచలన తీర్మానం
ఏపీలోని ఓ గ్రామం సంచలన తీర్మానం చేసింది. 15 వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ప్రభుత్వం మా బొడ్డపాడు గ్రామానికి పంపిన 9 లక్షల 80 వేల రూపాయలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మాగ్రామానికి తిరిగి ఇచ్చివెయ్యాలి ఆ గ్రామ సభ తీర్మానం చేసింది.
కృష్ణా జిల్లా, తోట్ల వల్లూరు మండలం, బొడ్డపాడు గ్రామంలో సర్పంచ్ మూడే శివ శంకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన బొడ్డపాడు గ్రామ సభ జరిగింది. తమ గ్రామానికి కేంద్రం పంపిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకోవడం దారుణమని, వెంటనే ఆ నిధులు తిరిగి ఇచ్చివెయ్యాలని బొడ్డపాడు గ్రామ ప్రజలు తమ గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ మూడే శివ శంకర్ మాట్లాడుతూ, 15 వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు సుమారు 3000 వేల కోట్ల రూపాయలు పంపిస్తే, దానిలో మా బొడ్డపాడు గ్రామానికి 9 లక్షల 80 వేల రూపాయలు వచ్చాయన్నారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి దారిన దారి మళ్లించి మా సంతకాలు లేకుండా, కనీసం మాకు ఒక మాటైనా చెప్పకుండా డబ్బులన్నీ తీసుకుందని చెప్పారు. ఆ డబ్బులు వస్తే మా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఎంతో ఆశగా మా బోర్డు, గ్రామ ప్రజలందరూ ఆశగా ఎదురు చూశామన్నారు. కానీ ఇప్పుడు ఆ డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారిలో దొంగలించడంతో మా గ్రామాభివృద్ధి ఏ విధంగా చెయ్యాలో జగన్ మోహన్ రెడ్డి, అధికారులు గ్రామ ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.
అదే విధంగా మా గ్రామానికి రావాల్సిన డబ్బులు వడ్డీతో వెంటనే చెల్లించకపొతే, గ్రామ ప్రజలందరి సంతకాలతో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై, సంబంధిత అధికారులపై కేసులు వెయ్యాలని గ్రామ సభలో తీర్మానించినట్లు సర్పంచ్ శివ శంకర్ తెలిపారు.
ఈ గ్రామ సభలో రాజకీయ పార్టీలకతీతంగా గ్రామ ప్రజలందరూ పాల్గొని తమ గ్రామానికి కేంద్రం పంపిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసివేసుకోవడంపై మండిపడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక పంపారు. గ్రామ సభలో ప్రజలందరూ సంతకాలు చేసిన ఈ తీర్మాణాన్ని జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పంపిస్తామని సర్పంచ్ శివ శంకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కూనపరెడ్డి శివశంకర్, పంచాయతీ సభ్యులు మసీముక్కు శ్రీనివాసరావు, పెనుమాక భాగ్యలక్ష్మి, గుర్రాల రజని, జాజుల కోటేశ్వరరావు, శీలం నాగార్జున రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.