బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (15:48 IST)

రైతుల పాదయాత్రకు పూలవర్షం కురుస్తోంది.. దేవినేని ఉమ

రాజధాని అమరావతి కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్రను చేపట్టిన రైతులపై రాళ్ల వర్షం కురుస్తాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు తీవ్రస్థాయిలో స్పందించారు. సీఎం జగన్ కుట్రలు పారలేదన్నారు. రైతుల పాదయాత్రపై రాళ్ల వర్షం కురవడం లేదని, పూల వర్షం కురుస్తుందన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రాజధానిగా ఉండాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నాని అన్నారు. అందుకే రైతులు చేపట్టిన పాదయాత్రపై వారు పూలవర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతిస్తున్నారన్నారు. 
 
రాజధాని అమరావతి కోసం ఇప్పటికే 250 మంది రైతులు బలిదానం చేశారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం రాజధాని విషయంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.