బూతులు మాట్లాడిన వైసీపీ నేతల్ని వదిలి, తెలుగు మహిళలను వేధిస్తారా?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించినందుకు, అనంతపురం తెలుగు మహిళా నేతల్ని పోలీసుల వేధించటం దుర్మార్గం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. అనంతపురంలోని తెలుగు మహిళా బీసీ నేతల ఇళ్లలోకి వెళ్లి, పోలీసులు సోదాల పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పోలీసులు వారిని ఎందుకు వేదిస్తున్నారు? బూతులు మాట్లాడిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి, బూతులు మాట్లాడొద్దన్నందుకు తెలుగు మహిళలను వేధిస్తారా? వైసీపీ నేతలు మహిళలను అసభ్యంగా మాట్లాడుతుంటే, సాటి మహిళలుగా స్పందించటం తప్పా? మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన వైసీపీ ప్రజాప్రతినిధులకు భద్రత పెంచిన ప్రభుత్వం, మహిళలను కించపరిచేలా మాట్లాడొద్దన్నందుకు తెలుగు మహిళలను అరెస్టు చేస్తామని బెదిరించటం సిగ్గుమాలిన చర్య అని అచ్చెన్నాయుడు అన్నారు.
అరెస్టు చేయాల్సింది తెలుగు మహిళలను కాదు, అసెంబ్లీ సాక్షిగా మహిళా లోకాన్ని అవమానించిన వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలని ఆయన డిమాండు చేశారు. మహిళల పట్ల వైసీపీ నేతల వ్యహహార శైలి, భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ముఖ్యమంత్రికి మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా, అసెంబ్లీలో మహిళలను అవమానించిన వారిని వెంటనే పదవుల నుంచి తొలగించి మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు.