విజయవాడలోని బందర్ రోడ్డులో రాఘవయ్య పార్క్ ఆధునికీకరణ
విజయవాడ నగరంలోని బందర్ రోడ్డులో రాఘవయ్య పార్క్ ఆవరణలో జరుగుతున్న ఆధునీకరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ శనివారం అధికారులతో కలసి పర్యవేక్షించారు. పార్క్ లో పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.
పార్క్ లో అభివృధిపరచిన గ్రీనరీ, లాన్, పాత్ వే మరియు పిల్లల ఆట పరికరాలు ఏర్పాటు మొదలగునవి పరిశీలిస్తూ, పార్క్ నందు సందర్శకులను ఆకర్షించే విధంగా అందమైన పూల మొక్కలు ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇంకా పార్క్ లో చేపట్టవలసిన ఇంజనీరింగ్, గ్రీనరీ పనులను కూడా సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని అన్నారు.
విజయవాడ నగరంలోని మున్సిపల్ పార్కులన్నింటినీ ఆధునికీకరిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. నగర ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని అందించేవి, ఇలాంటి పార్కులేనని అయన చెప్పారు. విజయవాడ మున్సిపల్ అధికారుల పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఎ.డి.హెచ్. జె. జ్యోతి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.