కిషన్ రెడ్డిని కలిశాక, సీఎం జగన్ సిమ్లా టూర్... అందుకేనా?
నిరంతరం ఊపిరి సలపని బిజీ షెడ్యూల్ లో ఉండే, ఎపీ సీఎం వై.ఎస్. జగన్ అకస్మాత్తుగా సిమ్లా టూర్ వెళ్ళడం వెనుక, ఆయన ఫ్యామిలీ మేటర్ ఉందని అందరికీ తెలుసు. ఆయన 25వ పెళ్ళి రోజు అక్కడ జరుపుకొంటున్నారు. కానీ, ఈ టూర్ వెనుక ఇంకో పెద్ద విషయం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇటీవల బీజేపీ జన ఆశీర్వాద యాత్రకు విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం జగన్‌ను కలిశారు. తేనేటి విందులో రాజకీయ కీలకాంశాలు చర్చించారు. ఇది జరిగిన తర్వాతే, సీఎం జగన్మోహన్‌రెడ్డి వారం రోజుల పర్యటన కోసం సిమ్లా వెళ్లారు.
ఈ రెండూ ఒక దానితో ఒకటి సంబంధం లేని అంశాలు అయినా, వీటి మధ్య రాజకీయ లింకు ఉన్నట్లు భావిస్తున్నారు. కిషన్‌రెడ్డితో మీటింగ్ తర్వాత, జగన్ సిమ్లా టూర్ కన్ఫామ్ కావడం కాకతాళీయం కాదంటున్నారు. ఆ సిమ్లా టూర్ ఏపీ భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సూచిక అంటున్నారు.
గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కిషన్‌రెడ్డి, ఇన్నాళ్లూ హోంమంత్రి అమిత్‌షాతో కలిసి పని చేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల గుట్టు కూడా ఆయనకు బాగానే తెలుసు. అందుకే భవిష్యత్ పరిణామాలపై సీఎం జగన్‌రెడ్డితో ఆయన చర్చించి ఉండవచ్చని తెలుస్తోంది. సిబిఐ జగన్ కేసులో తాత్సారం చేస్తోందని ప్రతిపక్షాల నుంచి, వైరి వర్గాల నుంచి విమర్శలు ఎప్పటి నుంచో బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తరఫున జగన్‌రెడ్డికి మరెంతో కాలం సహాయ సహకారాలు అందే పరిస్థితి లేదని కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.
గతంలో ఎన్వీ రమణ సీజేఐ కాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసి జ్యుడీషియరీ విషయంలో ఎంత తప్పిదం చేశారో కూడా జగన్ కు కిషన్ రెడ్డి గుర్తు చేసుంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీబీఐ, ఈడీ ఉచ్చు గట్టిగా బిగిసిందని, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీల ఘటనలను జగన్ రెడ్డికి గుర్తు చేసుంటారని చెపుతున్నారు. ఈడీ కేసుల తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటో, వాళ్లు ఏం చేశారో పూసగుచ్చినట్లు చెప్పారట. అన్నీ సైలెంట్‌గా విన్న సీఎం జగన్, ఆ విషయాలపై కుటుంబ సభ్యులతో చర్చించడానికే అప్పటికప్పుడు సిమ్లా టూర్ ప్లాన్ వేశారని అంటున్నారు. అది పేరుకే ఫ్యామిలీ ట్రిప్ కానీ, అసలు సంగతి వేరే ఉందని అంటున్నారు.
ప్రస్తుతం భార్య భారతి రెడ్డితో కలిసి సిమ్లాలో ఉన్నారు సీఎం జగన్. రేపో మాపో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల సైతం సిమ్లాలో జగన్‌తో జాయిన్ అవుతారని సమాచారం. కొన్ని రోజులుగా జగన్ తో షర్మిలకు విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అన్నమీద కోపంతోనే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారనే వాదన ఉంది. అదే సమయంలో అన్న చెల్లెలు లోలోపల సఖ్యతగానే ఉంటూ, పైకి మాత్రం రాజకీయ విభేదాలున్నట్లు నటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ను కలిసేందుకు షర్మిల వెళుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
తల్లి, చెల్లి, భార్యకు తన భవిష్యత్ కార్యచరణ వివరించి, వారితో మరింత చర్చించి, ఓ అవగాహనకు రావాలనే ఏపీ సీఎం జగన్ రెడ్డి సడెన్‌గా ఈ సిమ్లా టూర్ ప్లాన్ చేసినట్టు అభిప్రాయపడుతున్నారు. సిమ్లాలో జగన్ ఫ్యామిలికి పవర్ ప్లాంట్ ఉందని, ఆ గెస్ట్ హౌజ్ లోనే ప్రస్తుతం జగన్ మకాం చేశారని సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక.