శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (13:55 IST)

ఏపీ సర్కారుకు హైకోర్టు మొట్టికాయ.. కళాశాలల్లో అడ్మిషన్లను..?

ఏపీ సర్కారుకు హైకోర్టు మొట్టికాయ వేసింది. ఎయిడెడ్ కళాశాలల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ గట్టిగా తగిలింది. కళాశాలల్లో అడ్మిషన్లను కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
 
ఎయిడెడ్ కళాశాలలకు ఎయిడ్ నిలిపివేయడం, కళాశాలల స్వాధీనంపై హైకోర్టులో పిటీషన్  దాఖలు కాగా దీనిపై నేడు తీర్పు వెల్లడించింది. పిటీషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలను వినిపించారు.
 
ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్లను ఆపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయవాది శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. 
 
అయితే ఇక్కడ నర్రా శ్రీనివాస్ షాక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారని చదివి వినిపించారు. అడ్మిషన్లు జరగకపోతే లక్షలాది మంది విద్యార్దులు నష్టపోతారని ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు న్యాయవాది.
 
అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చని యాజమాన్యాలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల స్వాధీనం నోటిఫికేషన్ పై విచారణ చేపడతామని ఈ సందర్భంగా హైకోర్ట్ ధర్మాసనం స్పష్టం చేసింది.