1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (19:01 IST)

ఆ వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటాం.. ఏపీ జగన్ హామీ

వైఎస్ఆర్ ఆసరా పథకం రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభించారు జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేశ్, బాలినేని, విశ్వరూప్‌, పెద్దిరెడ్డి పాల్గొన్నారు.

ఎన్నికల ముందు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నామని, నేరుగా లబ్ధిదారులకు డబ్బులు వేస్తున్నామని జగన్ అన్నారు. డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. 
 
అప్పట్లో తాను పాదయాత్రలో చేసిన వ్యాఖ్యల వీడియోను ఈ సందర్భంగా జగన్ చూపించారు. చంద్రబాబు ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాల మాఫీ చేయలేదని అందులో జగన్ అన్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మిన మహిళలు ఆయన్ను సీఎంను చేశారని.. కానీ చంద్రబాబు మాత్రం మహిళలను మోసం చేశారని జగన్ ఆరోపించారు. 
 
చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించని కారణంగా బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి రూ.14వేల కోట్లుగా ఉన్న రుణాలు 2019 ఎన్నికల నాటికి రూ.25,517 కోట్లకు పెరిందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 18.3శాతం పొదుపు సంఘాలు మూతబడగా.. మిగిలిన సంఘాల పరపతి దెబ్బతిందని జగన్ వాపోయారు.