సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (08:37 IST)

జగన్ బెయిల్ రద్దయ్యే వరకు ధర్మపోరాటం చేస్తా : ఆర్ఆర్ఆర్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ బెయిల్ రద్దయ్యేంత వరకు న్యాయపోరాటం చేస్తానని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రకటించారు. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్టు చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఈడీ కోర్టుకు సీఎం జగన్‌, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకావలసి ఉందని, కానీ ఏదో ఒక కారణంతో వారు రావడం లేదని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఇంకా ఎన్ని వాయిదాలు వేస్తారో చూడాలన్నారు. 
 
ఆర్థికంగా వెనుకబడిన కులాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై స్పందిస్తూ.. చంద్రబాబు హయాంలో అందులో నుంచి కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించారని.. ఇది చాలా సముచితమని తెలిపారు. కానీ, ఇపుడు సీఎం జగన్ వాటిని రద్దు చేశారన్నారు. 
 
కాగా.. విశాఖలో ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు. ప్రజలు కరెంటు బిల్లు కట్టకపోతే జరిమానా వేయడమే కాకుండా ఫ్యూజులు పీకేస్తారని, కాంట్రాక్టులు చేసిన వారికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే ఎవరి ఫ్యూజులు పీకేయాలని ఆర్ఆర్ఆర్ నిలదీశారు. 
 
సినిమా టికెట్ల ధరల నియంత్రణ ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకేనంటున్న మంత్రి పేర్ని నాని.. దసరా సందర్భంగా ఆర్‌టీసీ చార్జీల బాదుడుకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సినిమా టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి అదనంగా అప్పులు తీసుకునేందుకే నాటకాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.